T20 World Cup 2022: కివీస్‌ను వెంటాడుతోన్న గాయాలు.. మరో స్టార్‌ బౌలర్‌ కూడా!

8 Oct, 2022 16:55 IST|Sakshi

న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌లో కివీస్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్ ఈ ట్రై సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫెర్గూసన్ ప్రస్తుతం పొత్తి కడుపు గాయంతో బాధపడుతున్నాడు. కాగా అతడికి దాదాపు వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం.

ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు కివీస్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డార్లీ మిచెల్‌ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తుండగా.. తాజాగా ఫెర్గూసన్‌కు కుడా గాయం కావడం న్యూజిలాండ్‌ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వెటరన్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నే కూడా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.

ఇక ఇదే విషయంపై కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్‌ స్పందిస్తూ.. "ఫెర్గూసన్ ప్రస్తుతం పొత్తికడుపు గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదు. న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. కానీ టీ20 ప్రపంచకప్‌ సమయానికి లూకీ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తాడని నేను భావిస్తున్నాను.

అతడు మా జట్టులో కీలక బౌలర్‌. గతేడాది ప్రపంచకప్‌లో దురదృష్టవశాత్తూ ఫెర్గూసన్ సేవలు కోల్పోయాం. ఈ సారి అలా జరగదని నేను ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక ట్రై సిరీస్‌ను న్యూజిలాండ్‌ ఓటమితో ప్రారంభించింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కివీస్‌ ఓటమిపాలైంది.
చదవండి: Women Asia Cup 2022 INDW VS BANW: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్‌

మరిన్ని వార్తలు