ఫెరారీ సవారీ...

13 Sep, 2020 02:59 IST|Sakshi

ఫార్ములావన్‌లో 1000వ రేసు బరిలో ఫెరారీ జట్టు 

ఈ ఘనత సాధించనున్న తొలి జట్టుగా రికార్డు 

నేడు టస్కన్‌ గ్రాండ్‌ప్రి రేసు 

సా. గం. 6.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

టస్కన్‌ (ఇటలీ): సొంతగడ్డపై విఖ్యాత మోటార్‌ రేసింగ్‌ జట్టు ఫెరారీ చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఫార్ములావన్‌ (ఎఫ్‌1) చరిత్రలో 1000 రేసుల్లో పాల్గొన్న తొలి జట్టుగా ఫెరారీ సంస్థ నేడు రికార్డు సృష్టించనుంది. ఇటలీలోని టస్కన్‌ పట్టణంలో నేడు జరిగే టస్కన్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్‌ లెక్‌లెర్క్‌ 5వ స్థానం నుంచి... ప్రపంచ మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ 14వ స్థానం నుంచి ప్రారంభించనున్నారు. 1950లో ఎఫ్‌1 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ క్రీడలో ఫెరారీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 999 రేసుల్లో పాల్గొన్న ఫెరారీ జట్టు డ్రైవర్లు 238 రేసుల్లో విజేతగా నిలిచారు.

ఎఫ్‌1 క్రీడలో అత్యధిక టైటిల్స్‌ నెగ్గిన జట్టుగా ఫెరారీకే గుర్తింపు ఉంది. విఖ్యాత డ్రైవర్‌ మైకేల్‌ షుమాకర్‌ పదేళ్లపాటు (1996–2006) ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆ జట్టుకు 72 విజయాలు అందించాడు. 871 రేసులతో ఫెరారీ జట్టు తర్వాత మెక్‌లారెన్‌ (బ్రిటన్‌) జట్టు రెండో స్థానంలో ఉంది. మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్లు 182 రేసుల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 15.144 సెకన్లలో ముగించి కెరీర్‌లో 95వ సారి, ఈ సీజన్‌లో ఏడోసారి ‘పోల్‌ పొజిషన్‌’ను సంపాదించాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్‌ రెండో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా