ఫీల్డర్ల ఏకాగ్ర‌త‌కు ప‌రీక్ష‌.. వైరలవుతున్న కొత్త ఫీల్డింగ్ డ్రిల్ 

11 Aug, 2021 12:02 IST|Sakshi

లండ‌న్‌: టీమిండియా ఫీల్డింగ్‌ను మ‌రింత మెరుగుప‌రిచేందుకు, ఫీల్డ‌ర్ల ఏకాగ్ర‌త‌ను ప‌రీక్షించ‌డానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్ ఓ వినూత్న ప్ర‌య‌త్నం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయ‌ర్స్‌కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్‌ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట‌ర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్ బ్యాటింగ్ చేస్తుండ‌గా.. స్టంప్స్ వెనుక రిష‌బ్ పంత్ కీపింగ్ చేస్తూ క‌నిపించాడు. అత‌ని ఏకాగ్ర‌త‌ను ప‌రీక్షించ‌డానికి శ్రీధ‌ర్ త‌న‌కు రెండు వైపులా ఇద్ద‌రు ప్లేయ‌ర్స్‌ను ఉంచాడు.

బౌల‌ర్ బౌలింగ్ చేస్తుండ‌గా.. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ అటు నుంచి ఇటు బంతిని విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మ‌ధ్య‌లో ఈ బాల్ వ‌ల్ల పంత్ త‌న ఏకాగ్ర‌త కోల్పోకుండా బౌల‌ర్ విసిరిన బంతిని ప‌ట్టుకోవాలి. ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది అంటూ బీసీసీఐ ట్విట‌ర్‌లో సంబంధిత వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు కొత్త ఫీల్డింగ్‌ డ్రిల్‌ ఐడియా అదుర్స్‌ అంటున్నారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా లార్డ్స్‌ మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తోంది. ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆటగాళ్లు చమటోడుస్తున్నారు.

మరిన్ని వార్తలు