ECS T20 League: 'నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం'.. అంటే ఇదేనేమో!

3 May, 2022 17:35 IST|Sakshi

క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు చూస్తూనే ఉంటాం. ఫీల్డర్‌ క్యాచ్‌ జారవిడవడం.. రనౌట్‌ మిస్‌ చేయడం.. సమన్వయలోపంతో మిస్‌ ఫీల్డ్‌ చేయడం జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక్క బంతికే జరగడం మాత్రం అరుదు. అలాంటిదే ఈసీఎస్‌ పోర్చుగల్‌ టి20 లీగ్‌లో చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా కోయింబ్రా నైట్స్‌, ఫ్రెండ్‌షిప్‌ సీసీ మధ్య 21వ లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన కోయింబ్రా నైట్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

కాగా ఫ్రెండ్‌షిప్‌ సీసీ జట్టు కాస్త నెమ్మదిగానే బ్యాటింగ్‌ చేసింది. కాగా చివరి ఓవర్‌లో పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. క్రీజులో ఉన్న సీసీ బ్యాటర్‌ మిడ్‌ వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అయితే క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో ఫీల్డర్‌ తప్పిదం చేశాడు. బంతి ఎక్కడ పడుతుందో అంచనా వేయలేక చతికిలపడ్డాడు. వెంటనే తేరుకొని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు త్రో విసిరాడు. క్యాచ్‌ పోతే పోయింది రనౌట్‌ అయ్యే అవకాశం వచ్చింది అని అనుకునేలోపే అది కూడా చేజారిపోయింది. ఫీల్డర్‌ వేసిన వేగానికి బంతి ఎక్కడ ఆగలేదు. నేరుగా థర్డ్‌మన్‌ దిశగా పరిగెత్తింది.

అక్కడ ఇద్దరు ఫీల్డర్లు ఉండడంతో రెండు పరుగులు మాత్రమే వస్తాయిలే అని అనుకుంటాం. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. బంతిని ఎవరో ఒకరు అందుకుంటారులే అని మనం అనుకుంటే ఇద్దరు వదిలేశారు.. ఇంకేముందు బంతి నేరుగా బౌండరీలైన్‌ దాటింది. దీంతో ఒక్క బంతికే సిక్సర్‌ రూపంలో కాకుండా ఆటగాళ్ల తప్పిదంతో ఆరు పరుగులు వచ్చాయి.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అంటే ఇదేనంటూ'' క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.

చదవండి: Prithvi Shaw: ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన పృథ్వీ షా.. ఐదేళ్ల ఐపీఎల్‌ శాలరీకి సమానం!

మరిన్ని వార్తలు