నాలుగు రోజుల పాటు సోషల్‌ మీడియాను బహిష్కరించిన ‘ఫిఫా’

1 May, 2021 04:29 IST|Sakshi

ఆటగాళ్లపై ద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసన

లండన్‌: తమ ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ద్వేషపూరిత కామెంట్లపై ఆగ్రహించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా), యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ (యూఈఎఫ్‌ఏ), కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌), అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌)లు నాలుగు రోజుల పాటు తమ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. ఈ విధంగానైనా ఆటగాళ్లపై ఆకతాయిలు చేసే అసభ్యకర కామెంట్లు ఆగుతాయని యూఈఎఫ్‌ఏ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ ఎఫెరిన్‌ ఆకాంక్షించాడు. ఇకపై ఆటగాళ్లపై చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు, ప్రీమియర్‌షిప్‌ రగ్బీ, లాన్‌ టెన్నిస్‌ సంఘం నాలుగు రోజుల బహిష్కరణకు మద్దతు తెలిపాయి.  

మరిన్ని వార్తలు