FIFA Football WC 2022: బెల్జియంపై భారీ అంచనాలు.. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి..!

17 Nov, 2022 06:58 IST|Sakshi

గత నాలుగు ప్రపంచకప్‌లలో యూరోప్‌ జట్లే విశ్వవిజేతగా నిలిచాయి. ఈసారీ యూరోప్‌ నుంచే మళ్లీ ప్రపంచ చాంపియన్‌ వచ్చే అవకాశాలున్నాయి. గత వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి కీలకమైన సెమీఫైనల్లో ఓటమి చవిచూసిన బెల్జియం మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా ఖతర్‌లో అడుగు పెట్టింది. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తడబడకుండా ఆడితే ఈసారి ఆ జట్టుకు గొప్ప ఫలితం లభిస్తుంది.  –సాక్షి క్రీడా విభాగం 

బెల్జియం 
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: మూడో స్థానం (2018). ‘ఫిఫా’ ర్యాంక్‌: 2. అర్హత ఎలా: యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ గ్రూప్‌ ‘ఇ’ విన్నర్‌. ఎంతో మంది స్టార్‌ ఆటగాళ్లతో నిండిన బెల్జియం జట్టును కచ్చితంగా టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా పరిగణించాలి. 14వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న బెల్జియం క్వాలిఫయింగ్‌ టోర్నీలో అజేయంగా నిలిచింది. ఆరు విజయాలు సాధించి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. సమకాలీన ఫుట్‌బాల్‌లో మేటి గోల్‌కీపర్‌గా పేరొందిన థిబాట్‌ కుర్టియస్, ఉత్తమ మిడ్‌ఫీల్డర్‌ కెవిన్‌ డి బ్రున్, స్టార్‌ ఫార్వర్డ్స్‌ లుకాకు, హెజార్డ్‌లతో బెల్జియం పటిష్టంగా కనిపిస్తోంది. తమ గ్రూప్‌లో క్రొయేషియాతో మ్యాచ్‌ మినహా మొరాకో, కెనడా జట్ల నుంచి బెల్జియంకు పెద్దగా ప్రతిఘటన ఉండకపోవచ్చు.   

మొరాకో 
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ (1986). ‘ఫిఫా’ ర్యాంక్‌: 22. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌ మూడో రౌండ్‌ విన్నర్‌.  ఆఫ్రికా క్వాలిఫయింగ్‌ టోర్నీలో అజేయంగా నిలిచిన మొరాకో ప్రపంచకప్‌ ప్రధాన టోర్నీలోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అయితే బెల్జియం, క్రొయేషియాలాంటి రెండు పటిష్ట జట్లను నిలువరించాలంటే మొరాకో అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. హకీమ్‌ జియచ్, హకీమీ కీలక ఆటగాళ్లు.  

కెనడా 
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్‌ దశ (1986). ‘ఫిఫా’ ర్యాంక్‌: 41. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా కరీబియన్‌ క్వాలిఫయింగ్‌ మూడో రౌండ్‌ విన్నర్‌.  మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌కు అర్హత పొందిన కెనడా జట్టులో అల్ఫోన్సో డేవిస్, డేవిడ్‌ల రూపంలో ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. రెండోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కెనడా 1986లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గ్రూప్‌లో బెల్జియం, క్రొయేషియా లాంటి పటిష్ట జట్లు ఉండటంతో కెనడా ఈసారైనా  పాయింట్ల ఖాతా తెరుస్తుందో లేదో వేచి చూడాలి. 

క్రొయేషియా 
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: రన్నరప్‌ (2018). ‘ఫిఫా’ ర్యాంక్‌: 12. అర్హత ఎలా: యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ గ్రూప్‌ ‘హెచ్‌’ విన్నర్‌. నాలుగేళ్ల క్రితం సంచలన ప్రదర్శనతో క్రొయేషియా తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత పలువురు సీనియర్‌ ఆటగాళ్లు రిటైర్‌ కావడంతో కొంత బలహీన పడ్డా యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించి తొలి అవకాశంలోనే ప్రపంచకప్‌ బెర్త్‌ సాధించింది.

తాజా జట్టులో అనుభవంలేని యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో స్టార్‌ మిడ్‌ ఫీల్డర్లు లుకా మోడ్రిచ్, బ్రొజోవిచ్, కొవాచిచ్‌ల ఆటతీరుపైనే క్రొయేషియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లోనూ ఫైనల్‌కు చేరడం చివరిసారి 2002లో జరిగింది. 1998 ప్రపంచకప్‌ రన్నరప్‌ బ్రెజిల్‌ 2002లో ఫైనల్‌ చేరడంతోపాటు విజేతగా నిలిచింది.  

మరిన్ని వార్తలు