Sunil Chhetri: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. సునీల్‌ ఛెత్రికి ఫిఫా అరుదైన గౌరవం

28 Sep, 2022 16:15 IST|Sakshi

ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. ఫుట్‌బాల్‌ క్రీడలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది.

రొనాల్డో, మెస్సీల లాగా సునీల్‌ ఛెత్రి ఫిఫా వరల్డ్‌కప్‌లు ఆడింది లేదు.. ప్రధాన ఫుట్‌బాల్‌ క్లబ్స్‌కు కూడా పెద్దగా ప్రాతినిధ్యం వహించింది లేదు. మరి ఫిఫా ఎందుకు సునీల్‌ ఛెత్రి డాక్యుమెంటరీ రూపొందించాలనుకుంది. పాపులారిటీ విషయంలో ఈ భారత కెప్టెన్‌ మెస్సీ, రొనాల్డోలతో సరితూగకపోవచ్చు కానీ.. గోల్స్‌ విషయంలో మాత్రం వారి వెనకాలే ఉన్నాడు.

ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ రికార్డు పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉంది. రొనాల్డో 117 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్‌ మెస్సీ 90 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఉన్నాడు. సునీల్ 131 మ్యాచ్‌ల్లో 84 గోల్స్‌ చేశాడు.

సునీల్‌ ఛెత్రి రొనాల్డో, మెస్సీలాగా ప్రపంచకప్‌లు ఆడకపోవచ్చు.. కానీ అతని ఆటతీరుతో ఒక స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఒక్క కారణంతోనే ఫిఫా సునీల్‌ ఛెత్రిపై డాక్యుమెంటరీ తీయాలని అనుకుంది. ఎవరికి తెలియని సునీల్‌ ఛెత్రి పేరును డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను స్వయంగా ఫిఫా తీసుకుంది.

భారతదేశం నుంచి ఫుట్‌బాల్‌లో హీరోగా వెలుగొందుతున్న సునీల్ ఛెత్రి లాంటి స్ట్రైకర్ ఎలా ఉద్భవించాడు.. అతని ఆటతీరును పరిచయం చేస్తూ డాక్యుమెంటరీ కొనసాగుతుంది. ఈ డాక్యుమెంటరీకి కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌(Captain Fantastic Series) అని పేరు పెట్టిన ఫిఫా ఇటీవలే మొదటి సీజన్ విడుదల చేసింది. అంతా ఊహించినట్లుగానే 'కెప్టెన్‌ ఫెంటాస్టిక్‌ సిరీస్‌' డాక్యుమెంటరీ సూపర్‌హిట్‌ అయింది.

అయితే కొన్నాళ్ల క్రితం సునీల్‌ ఛెత్రిపై ఫిఫా ఒక డాక్యుమెంటరీ రూపొందించనుందంటూ వార్తలు వచ్చాయి. అయితే మొదట ఛెత్రి, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఫిఫా ఒక ఆటగాడిపై డాక్యుమెంటరీ రూపొందింస్తుందంటే కచ్చితంగా గొప్ప ఆటగాడు అయి ఉండాలి. ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లు లేదా ఫుట్‌బాల్‌లో గొప్ప ఆట ఆడిన ఆటగాళ్లపై మాత్రమే ఫిఫా డాక్యుమెంటరీలు రూపొందిస్తుంది.

ఈ విషయంలో సునీల్‌ ఛెత్రి చాలా దూరంలో ఉన్నాడు. ప్రతి నాలుగేళ్లకోసారి ఉపఖండంలో జరిగే ఆసియా కప్‌లో మాత్రమే సునీల్‌ ఛెత్రి ఆడేవాడు. ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గోల్స్ చేస్తూ ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ల జాబితాలోకి అడుగుపెట్టిన సునీల్ ఎదుగుదల కథను ఫిఫా ప్రపం‍చానికి పరిచయం చేయాలనుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్ ఛెత్రిపై డాక్యుమెంటరీ మొదలుపెట్టింది.

మరిన్ని వార్తలు