Lionel Messi: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్‌.. చివరి మ్యాచ్‌ అని తట్టుకోలేక

15 Dec, 2022 14:04 IST|Sakshi

అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ తన దేశం తరపున ఆఖరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ మెస్సీకి ఆఖరిది కానుంది. ఈ విషయాన్ని సెమీస్‌లో క్రొయేషియాపై విజయం అనంతరం మెస్సీనే స్వయంగా ప్రకటించాడు. మెస్సీ నిర్ణయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం ఆఖరి మ్యాచ్‌ ఆడుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇందుకోసం అర్జెంటీనా సహా ఫిఫా అభిమానులు మెస్సీ టైటిల్‌ గెలవాలని పూజలు చేస్తున్నారు. మరి మెస్సీ టైటిల్‌ కొట్టి తన కలను నెరవేర్చుకుంటాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.ఈ విషయం పక్కనబెడితే.. క్రొయేషియాతో మ్యాచ్‌ అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసిన అర్జెంటీనాకు చెందిన మహిళ రిపోర్టర్‌ కన్నీటిపర్యంతం అయింది. రిపోర్టర్‌ ఎమోషన్‌కు చలించిపోయిన మెస్సీ చిరునవ్వుతో ఆమెను ఓదార్చాడు.  మ్యాచ్‌ విజయం అనంతరం మెస్సీని ఇంటర్య్వూ చేసింది.

''నా దృష్టిలో ఇది ప్రశ్న కాదు.. అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం(డిసెంబర్‌ 18న) ఫైనల్‌ ఆడబోతున్నాం. ఒక అర్జెంటీనా వ్యక్తిగా కప్పు మనమే గెలవాలని అందరితో పాటు నేను కోరుకుంటన్నా. కానీ దేశం తరపున మీకు ఇది చివరి మ్యాచ్‌ అని తెలిసినప్పటి నుంచి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజల్ట్‌తో మాకు సంబంధం లేదు. అది ఎలా అయినా రానీ మీరు మాత్రం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

అర్జెంటీనాలో చిన్న పిల్లాడిని అడిగినా మెస్సీ గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు. అలాంటిది మన జట్టు ఇవాళ ఫైనల్‌కు అడుగుపెట్టడంలో మీది కీలకపాత్ర కావడం మాకు సంతోషకరం. ఇప్పటికి ఇది నిజమా.. కలా అనేది తెలుసుకోలేకపోతున్నాం. ఫుట్‌బాల్‌కు మీరు చేసిన సేవలు ఎన్నటికి మరువం. మారడోనా లీగసీని కంటిన్యూ చేస్తూ ఫుట్‌బాల్‌లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించారు. మిమ్మల్ని బీట్‌ చేయడం ఎవరి తరం కాదు. మాలాంటి వాళ్లకు మెస్సీ ఒక స్పూర్తి.. ఒక అర్జెంటీనా మహిళను అయినందుకు గర్వపడుతున్నా థాంక్యూ మెస్సీ'' అంటూ ఎమోషనల్‌ అయింది.

ఇదంతా ఓపికతో విన్న మెస్సీ చిరునవ్వుతో మెరిశాడు. అనంతరం రిపోర్టర్‌ను దగ్గరికి తీసుకొని ఆమెను ఓదార్చాడు. మీతో సహా అర్జెంటీనా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తా. ఫిఫా వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం. ఈసారి వరల్డ్‌కప్‌లో మా జర్నీ అంత ఈజీగా సాగలేదు. క్లిష్ట పరిస్థితులను దాటుకొని ఫైనల్‌కు చేరుకున్నాం. మరొక అడుగు పూర్తి చేస్తే సక్సెస్‌ అయినట్లే. మీ అభిమానానికి థాంక్స్‌ అంటూ పేర్కొన్నాడు.

ఇక మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ అనంతరం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్‌ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్‌ సాధించాడు.ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్‌) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్‌) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్‌ క్లోజ్‌ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్‌ ముల్లర్‌ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 

చదవండి: FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు

Kylian Mbappe: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'

మరిన్ని వార్తలు