అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యను సస్పెండ్‌ చేసిన ఫిఫా

17 Aug, 2022 07:55 IST|Sakshi

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం విధించిన ‘ఫిఫా’

పలుమార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కఠిన చర్య

నిషేధ కాలంలో భారత జట్లకు మ్యాచ్‌లు ఉండవు, సమాఖ్యకు నిధులు రావు

సందిగ్ధంలో భారత్‌ ఆతిథ్యమివ్వాల్సిన అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌  

FIFA Suspends All India Football Federation: ఊహించినట్టే జరిగింది. భారత ఫుట్‌బాల్‌కు కష్టకాలం వచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య (ఫిఫా) నిషేధం విధించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో తృతీయ పక్షం జోక్యం సహించబోమని కొంతకాలంగా పలుమార్లు ‘ఫిఫా’ హెచ్చరించింది. కానీ ఏఐఎఫ్‌ఎఫ్‌ పట్టించుకోలేదు. దాంతో చివరకు ‘ఫిఫా’ భారత ఫుట్‌బాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ నిషేధం విధించిది. ఏఐఎఫ్‌ఎఫ్‌ పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేయాలి.

అలాకాకుండా అడ్‌హక్‌ కమిటీ, కోర్టులు నియమించిన పరిపాలక కమిటీ (ఇవన్నీ థర్డ్‌ పార్టీలు–తృతీయ పక్షం)లతో నడిచే జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాన్ని ‘ఫిఫా’ గుర్తించదు. ఈ కారణంతోనే ఏఐఎఫ్‌ఎఫ్‌ను సస్పెండ్‌ చేసింది. ‘ఫిఫా నియమావళికి విరుద్ధంగా నడుస్తున్న ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ‘ఫిఫా’ బ్యూరో కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. తక్షణం పరిపాలక కమిటీ తప్పుకోవాలి.

ఏఐఎఫ్‌ఎఫ్‌ కొత్త కార్యవర్గం ఎన్నికై, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు కావాలి. రోజువారీ కార్యకలాపాల్ని కొత్త కార్యవర్గం నిర్వహించినపుడే నిషేధాన్ని ఎత్తేసే చర్యలు చేపడతాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధం నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్‌–17 ప్రపంచకప్‌ కూడా షెడ్యూల్‌ ప్రకారం జరగదని ‘ఫిఫా’ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. 85 ఏళ్ల ఏఐఎఫ్‌ఎఫ్‌ చరిత్రలో ఇలా సస్పెన్షన్‌కు గురవడం ఇదే తొలిసారి.  
 
అసలేం జరిగింది...
దీనికంతటికీ కారణం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత ప్రఫుల్‌ పటేల్‌ పదవీ వ్యామోహమే! ఆయన ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. డిసెంబర్‌–2020తో ఆయన పదవీకాలం ముగిసినా కోర్టు కేసులు వేస్తూ కుర్చీని మాత్రం వీడలేదు. జాతీయ స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం గరిష్టంగా 12 ఏళ్లకు మించి అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగేందుకు వీలులేదు. దీంతో మోహన్‌ బగాన్‌ క్లబ్‌ జట్టు మాజీ గోల్‌కీపర్‌ కళ్యాణ్‌ చౌబే సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రఫుల్‌ పటేల్‌ను తప్పించి పరిపాలక కమిటీ (సీఓఏ)ని నియమించింది.  
 
‘ఫిఫా’ నిధులు బంద్‌
‘ఫిఫా’ తన సభ్య దేశాల్లో ఫుట్‌బాల్‌ క్రీడ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏటా రూ. కోట్లలో నిధులు ఇస్తుంది. సస్పెన్షన్‌తో ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోతాయి. దీని వల్ల ఏఐఎఫ్‌ఎఫ్‌ ఈ ఏడాది సుమారు రూ. 4 కోట్లు (5 లక్షల డాలర్లు) నష్టపోతుంది. మైదానాల నిర్మాణ, నాణ్యమైన ఫుట్‌బాల్‌ బంతులు, జెర్సీలు, సామాగ్రిల కోసం ‘ఫిఫా’ ఆ నిధుల్ని విడుదల చేస్తుంది.
 
కేంద్రం జోక్యం

ఏఐఎఫ్‌ఎఫ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు పరిధిలోని కేసును సత్వరం విచారించాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఏఎస్‌ బోపన్నల బెంచ్‌ను కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. బుధవారం తొలి కేసుగా ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికల అంశాన్నే విచారిస్తామని ద్విసభ్య ధర్మాసనం మెహతాకు తెలిపింది.
 
పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు
ఏఐఎఫ్‌ఎఫ్‌కు పాత నియమావళి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పరిపాలక కమిటీ స్పష్టం చేసింది. సస్పెన్షన్‌కు గురైన వెంటనే ఎన్నికల ప్రక్రియలో చలనం వచ్చింది. ‘ఫిఫా’ నిర్దేశించినట్లుగానే అనుబంధ రాష్ట్రాల సంఘాల ప్రతినిధులే ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికల్లో పాల్గొంటారని, మాజీ ఆటగాళ్లతో కూడిన ఓటర్లతో నిర్వహించబోమని తేల్చిచెప్పింది. ఏఐఎఫ్‌ఎఫ్‌ నియమావళిని కాదని సీఓఏ 36 సంఘాలను విస్మరించి ఈ స్థానంలో 36 మంది మాజీ ఫుట్‌బాలర్లతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. దీన్ని ‘ఫిఫా’ తోసిపుచ్చడంతో పాతపద్ధతిలోనే ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఆటకు ఎదురుదెబ్బ
నిషేధం ప్రభావం జాతీయ జట్టుకు, భారత క్లబ్‌ జట్లపై తీవ్రంగా ఉంటుంది. అంతర్జాతీయ, ఫ్రెండ్లీ మ్యాచ్‌లకు అవకాశమే ఉండదు. దీంతో వచ్చే నెల 24న వియత్నాంతో, 27న సింగపూర్‌తో సునీల్‌ ఛెత్రీ కెప్టెన్సీలో భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు అటకెక్కినట్లే! ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఇంటర్‌–జోనల్‌ సెమీఫైనల్స్‌లో భాగంగా సెప్టెంబర్‌ 7న జరగాల్సిన మోహన్‌ బగాన్‌ మ్యాచ్‌ కూడా కష్టమే! ఉజ్బెకిస్తాన్‌లో ఉన్న ఇండియన్‌ మహిళల లీగ్‌ చాంపియన్‌ ‘గోకులం కేరళ’ జట్టు మ్యాచ్‌లకు కూడా దెబ్బపడింది.

అక్కడ ఏఎఫ్‌సీ మహిళల క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో సొగ్దియానా క్లబ్‌తో ఈ నెల 23న, 26న ఇరాన్‌లో బామ్‌ ఖటూన్‌ ఎఫ్‌సీతో జరగాల్సిన మ్యాచ్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇరాక్‌లో వచ్చేనెల 14 నుంచి జరగాల్సిన ఏఎఫ్‌సీ అండర్‌–20 క్వాలిఫయర్స్‌లో కూడా భారత జట్టుకు అవకాశం ఉండదు. ఆ టోర్నీలో భారత్‌ 14న ఇరాక్‌తో, 16న ఆస్ట్రేలియాతో, 18న కువైట్‌తో ఆడాల్సి ఉంది. 
చదవండి: భారత్‌పై ఫిఫా నిషేధం.. విషయం చేయి దాటిపోయిందన్న స్టార్‌ ఫుట్‌బాలర్‌

మరిన్ని వార్తలు