FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్‌ చేసి.. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌

29 Nov, 2022 07:56 IST|Sakshi
బ్రెజిల్‌ జట్టు సంబరం(PC: FIFA)

FIFA World Cup 2022- Group G- Brazil Vs Switzerland- దోహా: ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్‌ వరుసగా రెండో విజయం సాధించి ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘జి’ లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 1–0 గోల్‌ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. ఆట 83వ నిమిషంలో కేస్‌మిరో చేసిన గోల్‌ బ్రెజిల్‌ను గెలిపించింది.

ఈ గెలుపుతో బ్రెజిల్‌ ఆరు పాయింట్లతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నాకౌట్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారి 2002లో ఆసియా వేదికపైనే జరిగిన ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ ఈసారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో సెర్బియాపై 2–0తో నెగ్గిన బ్రెజిల్‌ జట్టుకు ఈ మ్యాచ్‌లో గట్టిపోటీనే ఎదురైంది.

తొలి అర్ధభాగం గోల్స్‌ లేకుండానే
పలుమార్లు స్విట్జర్లాండ్‌ ‘డి’ ఏరియాలోకి బ్రెజిల్‌ ఆటగాళ్లు వెళ్లినా ఫినిషింగ్‌ చేయలేకపోయారు. దాంతో తొలి అర్ధభాగం గోల్స్‌ లేకుండానే ముగిసింది. రెండో అర్ధభాగంలోనూ బ్రెజిల్‌ దూకుడుగానే ఆడింది. చివరకు 66వ నిమిషంలో వినిసియస్‌ కొట్టిన షాట్‌ స్విట్జర్లాండ్‌ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో బ్రెజిల్‌ ఆటగాళ్లు సంబరం చేసుకున్నారు.

ఏడు నిమిషాల ముందు గోల్‌ చేసి
అయితే ‘వీఏఆర్‌’ రీప్లేలో ఆఫ్‌సైడ్‌గా తేలడంతో రిఫరీ గోల్‌ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత బ్రెజిల్‌ ఆటగాళ్లు నిరాశపడకుండా ఉత్సాహంతోనే ఆడారు. చివరకు నిర్ణీత సమయం ముగియడానికి ఏడు నిమిషాల ముందు గోల్‌ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యాచ్‌ మొత్తంలో బ్రెజిల్‌ ఐదుసార్లు గోల్‌ పోస్ట్‌ లక్ష్యంగా షాట్‌లు కొట్టగా... స్విట్జర్లాండ్‌ ఒక్క షాట్‌ కూడా బ్రెజిల్‌ గోల్‌పోస్ట్‌పైకి సంధించలేకపోయింది.    

చదవండి: Ruturaj Gaikwad: రుతు విధ్వంసకర ఇన్నింగ్స్‌! గొప్ప, చెత్త రికార్డు.. రెండూ మనోళ్లవే కదా! ఇక​ సెమీస్‌లో..
అతడు మసాజ్‌ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్‌

మరిన్ని వార్తలు