FIFA WC 2022: మరొక మ్యాచ్‌ ఓడితే అంతే సంగతి.. అర్జెంటీనా ప్రీక్వార్టర్స్‌ చాన్స్‌ ఎంత? 

23 Nov, 2022 17:06 IST|Sakshi

ఖతర్‌ వేదికగా మొదలైన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మెస్సీ అర్జెంటీనా 1-2 తేడాతో సౌదీ అరేబియా చేతిలో పరాజయం మూటగట్టుకుంది. ఒక్క ఓటమి అంతా తారుమారు చేస్తుందనడానికి ఇదే నిదర్శనం. అందునా అర్జెంటీనా స్టార్‌ లియోనల్‌ మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌‍కప్‌ అని అభిమానులు భావిస్తున్న వేళ ఆ జట్టు కప్‌ కొడితే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ అసలు కథ వేరేలా ఉంది.

ఇలా తొలి మ్యాచ్‌లో ఓడి వరల్డ్‌కప్‌  కొట్టిన సందర్భం ఒకసారి మాత్రమే చోటుచేసుకుంది. అది 2010 ఫిఫా వరల్డ్‌కప్‌లో. అప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌ ఇలాగే తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత ఫుంజుకొని అద్భుత ఆటతీరుతో విశ్వవిజేతగా అవతరించింది. ఇప్పుడు అర్జెంటీనా గ్రూప్‌ సి నుంచి కనీసం రౌండ్‌ ఆఫ్‌ 16 స్టేజ్‌కు చేరాలన్నా కూడా చెమటోడ్చాల్సిందే. 

అయితే ఆ జట్టు అదృష్టం కొద్దీ.. ఆ తర్వాత గ్రూప్‌ సిలో జరిగిన పోలాండ్‌, మెక్సికో మ్యాచ్‌ గోల్‌ లేకుండానే డ్రాగా ముగిసింది. దీంతో ఆ టీమ్స్‌ ఒక్కో పాయింట్ పంచుకున్నాయి. ప్రస్తుతం గ్రూప్‌ సిలో మూడు పాయింట్లతో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. ఆ తర్వాత మెక్సికో, పోలాండ్ ఉన్నాయి. అర్జెంటీనా పాయింట్లు లేకుండా చివరిస్థానంలో ఉంది.

అర్జెంటీనా ఇతర టీమ్స్‌పై ఆధార పడకుండా ప్రీక్వార్టర్స్‌ చేరాలంటే ఆడాల్సిన రెండు మ్యాచ్‌లలోనూ కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తే ఆ టీమ్‌ ఖాతాలో ఆరు పాయింట్లు ఉంటాయి. అంటే తన తర్వాతి మ్యాచ్‌లలో మెక్సికో, పోలాండ్‌లను అర్జెంటీనా ఓడించాల్సి ఉంటుంది. ఇక సౌదీ అరేబియాను అటు మెక్సికో, ఇటు పోలాండ్‌ ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ రెండు టీమ్స్‌ నాలుగు పాయింట్లతో ఉండగా.. అర్జెంటీనా ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచి క్వాలిఫై అవుతుంది.

ఒకవేళ అర్జెంటీనా ఒక మ్యాచ్‌ గెలిచి, మరో మ్యాచ్ డ్రా చేసుకున్నా.. నాలుగు పాయింట్లతో ప్రీక్వార్టర్స్‌కు వెళ్లొచ్చు.  కానీ మిగతా జట్ల ఫలితాలు వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. ఇక అర్జెంటీనా తన తర్వాతి మ్యాచ్‌లో మెక్సికోతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు జరగనుంది. ఆడాల్సిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడినా అర్జెంటీనాకు ప్రీక్వార్టర్స్‌ అవకాశాలు కష్టమవుతాయి.

చదవండి: ఇదేనా ఆటతీరు.. మెరుపుల్లేవ్‌!

>
మరిన్ని వార్తలు