FIFA WC 2022: ఇదీ ఆటంటే.. ఆఖరి నిమిషంలో రెండు గోల్స్‌; ఇరాన్‌ సంచలనం

25 Nov, 2022 17:51 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌ తమ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇరాన్‌ ఆఖరి నిమిషంలో జూలు విదిల్చి 2-0 తేడాతో వేల్స్‌ను చిత్తు చేసింది. వేల్స్‌ ఆటగాళ్ల అలసత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఇరాన్‌ ఆట అదనపు సమయంలో వరుసగా రెండు గోల్స్‌ చేసి సంచలన విజయం సాధించింది. తొలి అర్థభాగం గోల్‌ లేకుండా ముగిసింది.

తొలి అర్థభాగంలో ఇరాన్‌ వేల్స్‌ గోల్‌పోస్టుపై పదేపదే దాడి చేసింది. ఒక దశలో మూడుసార్లు గోల్‌ కొట్టే చాన్స్‌ వచ్చినట్లే వచ్చి మిస్‌ అయింది. అలా తొలి అర్థభాగం ముగిసింది. రెండో అర్థభాగంలోనే అదే పరిస్థితి. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్‌ చేయడంలో విఫలం కావడంతో మరో డ్రా అనుకుంటున్న దశలో ఇరాన్‌ జూలు విదిల్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆట 90+9వ నిమిషంలో రూబెజ్‌ చెష్మీ ఇరాన్‌కు తొలి గోల్‌ అందించాడు.

ఆ తర్వాత కాసేపటికే రమిన్‌ రిజెయిన్‌ కూడా గోల్‌ కొట్టడంతో ఇరాన్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంతలో అదనపు సమయం ముగియడంతో ఇరాన్‌ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఇరాన్‌ 2-6 తేడాతో ఓడిపోయింది. తాజాగా వేల్స్‌ను ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 16 ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలి మ్యాచ్‌ డ్రా చేసుకున్న వేల్స్‌.. తాజాగా ఇరాన్‌ చేతిలో ఓడి ప్రి క్వార్టర్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. 


 

మరిన్ని వార్తలు