Messi- Ronaldo: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! మరి రొనాల్డో సంగతి? ఆరోజు ‘అవమానకర’ రీతిలో..

19 Dec, 2022 13:12 IST|Sakshi

Lionel Messi- Cristiano Ronaldo: ఏడుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా ‘బాలన్‌ డీర్‌’ అవార్డు... ప్రతిష్టాత్మక క్లబ్‌ బార్సిలోనా తరఫున ఏకంగా 35 టైటిల్స్‌లో భాగం... ఏ లీగ్‌లోకి వెళ్లినా అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా ఘనత... లెక్కలేనన్ని రికార్డులు, అపార ధనార్జన... అపరిమిత సంఖ్యలో అతని నామం జపించే అభిమానులు... మెస్సీ గురించి ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. ఫుట్‌బాల్‌ మైదానంలో అతను చూపించిన మాయకు ప్రపంచం దాసోహమంది... ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా  గొప్పగా కీర్తించింది...

కానీ...కానీ... అదొక్కటి మాత్రం లోటుగా ఉండిపోయింది. మెస్సీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరల్డ్‌ కప్‌ మాత్రం గెలవలేదే అనే ఒక భావన... 2006లో అడుగు పెట్టిన నాటి నుంచి 2018 వరకు నాలుగు టోర్నీలు ముగిసిపోయాయి. కానీ ట్రోఫీ కోరిక మాత్రం తీరలేదు. 2014లో అతి చేరువగా ఫైనల్‌కు వచ్చినా, పేలవ ఆటతో పరాభవమే ఎదురైంది.

రొనాల్డోతో ప్రతీసారి పోలిక
వరల్డ్‌ కప్‌ లేకపోయినంత మాత్రాన అతని గొప్పతనం తగ్గదు... కానీ అది కూడా ఉంటే బాగుంటుందనే ఒక భావన సగటు ఫ్యాన్స్‌లో బలంగా నాటుకుపోయింది. అతని సమకాలీకుడు, సమఉజ్జీ క్రిస్టియానో రొనాల్డోతో ప్రతీసారి ఆటలో పోలిక...

కానీ ఇప్పుడు మెస్సీ వరల్డ్‌ కప్‌ విన్నర్‌ కూడా... ఈ విజయంతో అతను రొనాల్డోను అధిగమించేశాడు... అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అంటే మారడోనానే పర్యాయపదం... 1986లో అతను ఒంటి చేత్తో (కాలితో) తమ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఆ దేశపు అభిమానులు మరచిపోలేదు.

అంతటివాడు అనిపించుకోవాలంటే వరల్డ్‌ కప్‌ గెలవాల్సిందే అన్నట్లుగా ఆ దేశం మెస్సీకి ఒక అలిఖిత ఆదేశం ఇచ్చేసింది! ఎట్టకేలకు అతను ఆ సవాల్‌ను స్వీకరించాడు... తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో పరాజయం ఎదురైన తర్వాత తమను లెక్కలోంచే తీసేసిన జట్లకు సరైన రీతిలో సమాధానమిచ్చాడు. మైదానం అంతటా, అన్నింటా తానై అటు గోల్స్‌ చేస్తూ, అటు గోల్స్‌ చేసేందుకు సహకరిస్తూ టీమ్‌ను నడిపించాడు.

ప్రపంచ కప్‌ చరిత్రలో గ్రూప్‌ దశలో, ప్రిక్వార్టర్స్, క్వార్టర్‌ ఫైనల్లో, సెమీస్‌లో, ఫైనల్లో గోల్‌ చేసిన ఏకైక ఆటగాడు కావడంతో పాటు జట్టును శిఖరాన నిలిపాడు. శాశ్వత కీర్తిని అందుకుంటూ అర్జెంటీనా ప్రజలకు అభివాదం చేశాడు. చివరగా...మెస్సీ భావోద్వేగాలు చూస్తుంటే సచిన్‌ టెండూల్కర్‌ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్‌లో అన్నీ సాధించిన తర్వాత లోటుగా ఉన్న క్రికెట్‌ ప్రపంచకప్‌ను ఆరో ప్రయత్నంలో అందుకోవడం, అతడిని సహచరులు భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరిగిన ఘటన మీ కళ్ల ముందు నిలిచిందా! -సాక్షి, క్రీడా విభాగం.

మరి రొనాల్డో సంగతి?!
గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌(GOAT).. ప్రస్తుత తరంలో మేటి ఫుట్‌బాల్‌ ఆటగాడు ఎవరు అంటే.. ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. అన్నిటిలోనూ పోటాపోటీ.. అయితే, మెస్సీ ఖాతాలో ఇప్పుడు వరల్డ్‌కప్‌ టైటిల్‌ ఉంది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇక ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచే అవకాశమే లేదు. 

నిజానికి, ఖతర్‌ ఈవెంట్లో మొదటి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలైనా ఏమాత్రం కుంగిపోక.. ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ జట్టును ఫైనల్‌ వరకు తీసుకువచ్చాడు మెస్సీ. నాయకుడిగా, ఆటగాడిగా తన అపార అనుభవాన్ని ఉపయోగించుకుంటూ జట్టును ఆఖరి మెట్టు వరకు తీసుకువచ్చాడు.

ఉత్కంఠభరిత ఫైనల్లోనూ చిరునవ్వు చెదరనీయక ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడి విజయదరహాసం చేశాడు. కానీ రొనాల్డోకు ఈ మెగా టోర్నీకి ముందే ఎదురుదెబ్బలు తగిలాయి. యునైటెడ్‌ మాంచెస్టర్‌తో బంధం తెగిపోవడం సహా కీలక ప్రి క్వార్టర్స్‌లో జట్టులో చోటు కోల్పోవడం వంటి పరిణామాలు జరిగాయి. పోర్చుగల్‌ సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అతడు ఆలస్యంగా బరిలోకి దిగాడు.

ఈ నేపథ్యంలో రొనాల్డో ప్రవర్తన వల్లే కోచ్‌ అతడిని కావాలనే పక్కనపెట్టాడనే వార్తలు వినిపించాయి. ఏదేమైనా మెస్సీ తన హుందాతనంతో ఘనంగా ప్రపంచకప్‌ టోర్నీకి వీడ్కోలు పలికితే.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో నిష్క్రమించినట్లయింది. దీంతో ఇద్దరూ సమఉజ్జీలే అయినా మెస్సీ.. రొనాల్డో కంటే ఓ మెట్టు పైకి చేరాడంటూ ఫుట్‌బాల్‌ అభిమానులు అంటున్నారు.

చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు..
Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్‌ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’
Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!

మరిన్ని వార్తలు