Lionel Messi: ఆదిలోనే సౌదీ చేతిలో ఓటమి! తుది అంకానికి చేరుకున్నాం.. మెస్సీ పోస్ట్‌ వైరల్‌

14 Dec, 2022 11:38 IST|Sakshi

FIFA World Cup 2022- Argentina Vs Croatia- Lionel Messi- Final: ‘‘కొన్నిసార్లు పరిస్థితులు మాకు అనుకూలించకపోవచ్చు.  అయితే, మా జట్టు ఉత్తమమైనది. ఎప్పుడు ఎలా ఆడాలో..  క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఓటములను దాటుకుని ఎలా ముందుకు సాగాలో తెలుసు. ప్రతి మ్యాచ్‌ మాకు ఎంతో ముఖ్యమైనదే’’ అని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ అన్నాడు.  జట్టు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చేరిన తరుణంలో సహచర ఆటగాళ్లను అభినందిస్తూ ప్రశంసలు కురిపించాడు.

ఫిఫా ప్రపంచకప్‌-2022 తొలి సెమీ ఫైనల్లో క్రొయేషియాతో తలపడ్డ అర్జెంటీనా 3-0తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తద్వారా ఈ ఎడిషన్‌లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. 34వ నిమిషంలో మెస్సీ గోల్‌కు తోడు.. జూలియన్‌ అల్వారెజ్‌ రెండు గోల్స్‌ సాధించడంతో అర్జెంటీనా విజయం ఖరారైంది. ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయిన మోడ్రిచ్‌ బృందం నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇంకొక్క అడుగు
ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మెస్సీ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తాను పూర్తిగా ఆస్వాదిస్తున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు.  ‘‘ఈ రోజు మా ఆట తీరు గొప్పగా ఉంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన తర్వాతే మైదానంలో దిగాము. 

మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. మా జట్టులో ఉన్న వాళ్లంతా ఇంటెలిజింట్లే’’ అంటూ మెస్సీ సహచర ఆటగాళ్లను కొనియాడాడు.  అదే విధంగా.. ‘‘చివరి అంకానికి చేరుకున్నాం!!! మమ్మల్ని నమ్మిన వాళ్లందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఇన్‌స్టా వేదికగా మ్యాచ్‌కు సంబంధించి ఫొటోలు పంచుకున్నాడు. కోటిన్నరకు పైగా లైకులతో ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఆరంభంలోనే సౌదీ చేతిలో ఓటమి!
కాగా ఆదివారం నాటి ఫైనల్లో గనుక అర్జెంటీనా గెలిస్తే మెస్సీ ఖాతాలో వరల్డ్‌కప్‌ టైటిల్‌ చేరుతుంది. ఇక కోపా అమెరికా 2021 విజేతగా నిలవడంతో పాటు వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు 36 మ్యాచ్‌లలో ఓటమన్నదే తెలియని అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాకిచ్చిన విషయం తెలిసిందే.

51వ ర్యాంకర్‌ అయిన సౌదీ.. మెస్సీ బృందాన్ని 2-1తో ఓడించి గట్టి షాకిచ్చింది. దీంతో ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో తమ తొలి మ్యాచ్‌లోనే అర్జెంటీనాకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, ఆ తర్వాత అవాతంరాలన్నీ అధిగమిస్తూ ఒక్కో మెట్టు ఎక్కిన మెస్సీ బృందం ఫైనల్‌ వరకు చేరుకుంది. 

చదవండి: FIFA WC 2022 Final: ఫైనల్‌ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు
ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌..

A post shared by Leo Messi (@leomessi)

మరిన్ని వార్తలు