Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు..

19 Dec, 2022 11:19 IST|Sakshi

Kylian mbappe Beats Messi Win Award: ‘‘మెస్సీ ఈ విజయానికి నూటికి నూరుపాళ్లు అర్హుడే.. అయితే, ఎంబాపే మాత్రం ఓటమికి అర్హుడు కాదు’’... ఆదివారం నాటి ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం చూసిన సగటు అభిమాని కనీసం ఒక్కసారైనా మనసులో ఈ మాట అనుకుని ఉంటాడనడంలో సందేహం లేదు. మ్యాచ్‌ మొదటి అర్ధ భాగంలో ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్‌.. విజయం అంచుల దాకా వెళ్లే వరకు అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించిందంటే అదంతా కెప్టెన్‌ కైలియన్‌ ఎంబాపే చలవే!

అప్పటి దాకా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంబాపె.. రెండో అర్ధ భాగంలో ఒక్కసారిగా విజృంభించాడు. 97 సెకన్ల వ్యవధిలో చకచకా రెండు గోల్స్‌ చేసి అర్జెంటీనాకు షాక్‌ ఇచ్చి... అభిమానుల గుండె వేగం పెంచాడు. ఈ క్రమంలో స్కోరు సమం(2-2) చేసిన ఫ్రాన్స్‌ జోరు పెరిగింది. అర్జెంటీనా గోల్‌పోస్ట్‌ను పదే పదే అటాక్‌ చేసింది.

హోరాహోరీ పోరు..
దీంతో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరు జట్ల స్కోరు సమంగా ఉండటంతో అదనపు సమయం కేటాయించారు. అప్పటికే గోల్‌తో మెరిసిన మెస్సీ మరోసారి మ్యాజిక్‌ రిపీట్‌ చేశాడు.. గోల్‌ కొట్టి అర్జెంటీనాను ముందుకు తీసుకువెళ్లాడు. తన చిరకాల కలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేశాడు.

కానీ, ఓటమిని అంగీకరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఎంబాపె తమకు దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి ప్రేక్షకులు ఉత్కంఠతో మునివేళ్ల మీద నిల్చునేలా చేశాడు. అదనపు సమయం ముగిసే సరికి కూడా 3-3తో అర్జెంటీనా- ఫ్రాన్స్‌ సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పలేదు. 

అయితే, షూటౌట్‌లో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో పెనాల్టీ తీసుకున్న గొంజాలో మోంటీల్‌ విజయవంతంగా గోల్‌ కొట్టడంతో ఎంబాపె బృం‍దం ఆశలు ఆవిరయ్యాయి. ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి మెస్సీ సేన వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. 

అంచనాలు తలకిందులు చేసి
ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో ప్రపంచకప్‌ సాధించాలన్న 35 ఏళ్ల మెస్సీ ఆశయం నెరవేరగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ను మరోసారి విజేతగా నిలపాలన్న 23 ఏళ్ల ఎంబాపె కల చెదిరిపోయింది. నిజానికి ఆరంభంలోనే పట్టు సాధించిన అర్జెంటీనా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించినా.. ఆ అంచనాలు తలకిందులు చేశాడు ఎంబాపె.

మెస్సీని వెనక్కినెట్టి...
ఏదేమైనా తాను అనుకున్న ఫలితం రాబట్టలేకపోయినా ఫైనల్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ మెరిసిన ఎంబాపె.. మెస్సీతో పాటు తానూ హీరోనే అనిపించుకున్నాడు. ఈ ఎడిషన్‌లో 8 గోల్స్‌ చేసి మెస్సీని దాటుకుని గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలుచుకున్నాడు.

ఈ నేపథ్యంలో మెస్సీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూనే.. ఫైనల్‌ మ్యాచ్‌ను చిరస్థాయిగా నిలిచిపోయేలా తన ఆట తీరుతో అలరించిన ఎంబాపె ఆట తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సాకర్‌ అభిమానులు. ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌  టైమ్‌(GOAT) మెస్సీనే.. అయినా నువ్వేమీ తక్కువ కాదు ఎంబాపె. 

మెస్సీ ట్రోఫీ గెలిచి మా హృదయాలు పులకింపజేశాడు.. నువ్వు కూడా నీ పోరాటపటిమతో మా మనసులు గెలిచావు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అతడిని అభినందిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత దిగాలుగా కూర్చున్న ఎంబాపె వద్దకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ వచ్చి అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. ‘‘బాధపడకు మిత్రమా.. మెస్సీ ఒక్కడే కాదు నువ్వు కూడా విజేతవే!’’ అంటూ ఎంబాపెకు విషెస్‌ తెలియజేస్తున్నారు.

చదవండి: FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు
KL Rahul: అంత సులువేమీ కాదు.. కష్టపడ్డాం.. గెలిచాం! కాస్త రిలాక్సైన తర్వాతే..

మరిన్ని వార్తలు