-

FIFA WC 2022: ఆతిథ్య దేశానికి మరో ఓటమి.. ఇక ఇంటికే

25 Nov, 2022 21:16 IST|Sakshi

ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చి తగిన గుర్తింపు పొందిన ఖతర్‌ దేశం ఆటలో మాత్రం మెరవలేకపోయింది. గ్రూప్‌-ఏలో భాగంగా శుక్రవారం సెనెగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖతర్‌ 1-3 తేడాతో ఓడిపోయింది.  ఈ విజయంతో సెనెగల్‌ వరల్డ్‌కప్‌లో తమ ఖాతా తెరిచి రౌండ్‌ ఆఫ్‌ 16 ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక వరుసగా రెండో పరాజయం చవి చూసిన ఖతర్‌ ఇంటిబాట పట్టినట్లే.  

మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆతిథ్య ఖతర్‌పై సెనెగల్‌ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. తొలి అర్థభాగంలో ఆట 41వ నిమిషంలో బులాయో డిఐఏ సెనెగల్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే ఆట 48వ నిమిషంలో ఫర్మారా డియోహౌ రెండో గోల్‌ అందించాడు. దీంతో తొలి అర్థభాగం ముగిసేసరికి సెనెగల్‌ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఇక రెండో అర్థభాగంలో ఆట 78వ నిమిషంలో ఖతర్‌కు తొలి గోల్‌ వచ్చింది. మహ్మద్‌ ముంతారి ఖతర్‌కు తొలి గోల్‌ అందించాడు. దీంతో 2-1తో ఖతర్‌ కాస్త లైన్లోకి వచ్చినట్లే అనిపించింది. కానీ ఆట 84వ నిమిషంలో సెనెగల్‌ చెక్‌ డింగ్‌ మరో గోల్‌ కొట్టడంతో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఖతర్‌ మరో గోల్‌ చేయడంలో విఫలం కాగా సెనెగల్‌ ఈ వరల్డ్‌కప్‌లో తొలి గెలుపును రుచి చూసింది. 

చదవండి: కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న రెజ్లింగ్‌ స్టార్‌

ఇదీ ఆటంటే.. ఆఖరి నిమిషంలో రెండు గోల్స్‌; ఇరాన్‌ సంచలనం

మరిన్ని వార్తలు