FIFA WC 2022: ఒక్క ఓటమి.. అరుదైన రికార్డు మిస్‌ చేసుకున్న అర్జెంటీనా

22 Nov, 2022 18:36 IST|Sakshi

ఖతర్‌ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో ఓటమితో అర్జెంటీనా జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. సౌదీ అరేబియా పటిష్టమైన డిఫెన్స్‌కు తోకముడిచిన మెస్సీ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా మ్యాచ్‌ ఓడిపోగానే స్టాండ్స్‌లో ఉన్న ఆ దేశ అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఎందుకంటే ది గ్రేట్‌ మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ కావడం. దీంతో పాటు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఏ జట్టుకు శుభసూచకం కాదని గతంలో వచ్చిన ఫలితాలు సూచిస్తున్నాయి. అందుకే ఫ్యాన్స్‌ అంతలా బాధపడిపోయారు.

కాగా సౌదీతో మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ఇందులో 25 విజయాలు ఉండగా.. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చివరగా 2019 కోపా అమెరికా కప్‌ సెమీఫైనల్లో బ్రెజిల్‌ చేతిలో ఓడిన అర్జెంటీనా ఆ తర్వాత వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకపోవడం విశేషం. 

ఈ 36 మ్యాచ్‌ల్లో ప్రెండ్లీ మ్యాచ్‌లు, 2021 కోపా అమెరికా కప్‌తో పాటు 2022 ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో 2021 కోపా అమెరికా కప్‌ను మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనానే గెలుచుకోవడం విశేషం. అయితే తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓటమితో అంతా తారుమారైంది.

ఇప్పటివరకు ఇటలీ జట్టు వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని జట్టుగా తొలి స్థానంలో ఉంది. అక్టోబర్‌ 2018 నుంచి అక్టోబర్‌ 2021 వరకు రెండేళ్ల పాటు ఇటలీకి 37 మ్యాచ్‌ల్లో ఓటమి అనేదే లేదు. ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఇటలీ రికార్డును బద్దలు కొడుతుందని అంతా భావించారు. కానీ మెస్సీ బృందానికి ఆ అవకాశాన్ని సౌదీ అరేబియా దూరం చేసింది.

చదవండి: FIFA WC: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌదీ అరేబియా

మరిన్ని వార్తలు