FIFA WC 2022: అమెరికా ఆరోసారి.. ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి!

1 Dec, 2022 08:18 IST|Sakshi
ఆసీస్‌ జట్టుకు గోల్‌ అందించిన మాథ్యూ లెకీ (PC: FIFA Twitter)

FIFA world Cup Qatar 2022: గత ప్రపంచకప్‌నకు అర్హత పొందలేకపోయిన అమెరికా జట్టు ఈసారి మాత్రం గ్రూప్‌ దశను దాటి నాకౌట్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో భాగంగా ఇరాన్‌తో జరిగిన చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో అమెరికా 1–0తో గెలిచింది. ఆట 38వ నిమిషంలో క్రిస్టియన్‌ పులిసిక్‌ గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. 11వసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న అమెరికా ఆరోసారి గ్రూప్‌ దశను అధిగమించింది. ప్రి క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో అమెరికా తలపడుతుంది. 

ఆస్ట్రేలియా 2006 తర్వాత...
గత మూడు ప్రపంచకప్‌లలో గ్రూప్‌ దశలోనే ఇంటి ముఖం పట్టిన ఆస్ట్రేలియా ఈసారి నాకౌట్‌ బెర్త్‌ను సంపాదించింది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘డి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1–0 గోల్‌తో డెన్మార్క్‌ జట్టును ఓడించింది. ఆట 60వ నిమిషంలో మాథ్యూ లెకీ ఆసీస్‌ జట్టుకు గోల్‌ అందించాడు.

ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో ఆస్ట్రేలియాకిది రెండో విజయం. దాంతో 2006 తర్వాత ఆస్ట్రేలియా ఈ మెగా ఈవెంట్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. రెండు విజయాలతో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచినా మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా ఫ్రాన్స్‌ జట్టు గ్రూప్‌ ‘డి’ టాపర్‌గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియాకు రెండో స్థానం ఖరారైంది.

చదవండి: Sanju Samson: పంత్‌ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

మరిన్ని వార్తలు