Cristiano Ronaldo: రొనాల్డోకు ఘోర అవమానం? పాపం.. బెంచ్‌ మీద కూర్చుని నిర్లిప్తతతో.. సిగ్గుచేటు అంటూ..

7 Dec, 2022 15:01 IST|Sakshi

FIFA World Cup 2022 Portugal Vs Switzerland- Cristiano Ronaldo: ‘‘శుభాభినందనలు పోర్చుగల్‌! 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతున్న సమయంలో అభిమానుల కళ్లన్నీ​ నీమీదే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్‌ లేకుండానే బరిలోకి దిగడం, ఆ 90 నిమిషాలు నీ ఆటను ఆస్వాదించకుండానే ముగిసిపోవడం నిజంగా సిగ్గుచేటు. 

అభిమానులు నీకోసం వెదుకుతూనే ఉన్నారు. నీ పేరును కలవరిస్తూనే ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల నీ ప్రియమైన స్నేహితుడు ఫెర్నాండో నీతో కలిసి నడవాలి. మరో మ్యాచ్‌లోనైనా నిన్ను చూసే అవకాశం ఇవ్వాలి’’ అంటూ పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్‌ జార్జినా రోడ్రిగేజ్‌ ఆ జట్టు కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌ తీరుపై విరుచుకుపడింది.

ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డ జార్జినా.. ఆ తర్వాత తన పోస్టును డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది? ఇంతటి అవమానమా?
కెప్టెన్‌, స్టార్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డో లేకుండా స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ ఆడింది పోర్చుగల్‌. అతడి స్థానంలో పీప్‌ సారథిగా వ్యవహరించగా.. రొనాల్డో ప్లేస్‌ను 21 ఏళ్ల రామోస్‌తో భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్‌ ఫెర్నాండో తీరుపై విరుచుకుపడుతున్నారు.

కాగా గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో తలపడిన సమయంలో  రొనాల్డో ఆ జట్టు ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘‘నా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌ వస్తున్న సమయంలో.. సదరు కొరియా వ్యక్తి నన్ను తొందరగా వెళ్లిపోవాలంటూ చెప్పాడు.

అదే వివాదానికి దారి తీసింది
దీంతో అతడిని సైలెంట్‌గా ఉండాలని చెప్పాను. నన్ను అలా అనడానికి అతడికి అధికారం లేదు కదా. నేను ఎప్పుడు వెళ్లాలో రిఫరీ చూసుకుంటారు. అదే విషయం అతడికి చెప్పాను అంతే’’ అని పేర్కొన్నాడు. అయితే, ఆ సమయంలో మూతి మీద వేలు వేసుకంటూ ష్‌ అంటూ రొనాల్డో సైగ చేయడం వివాదానికి దారి తీసింది.

అయితే, రొనాల్డో మాత్రం ఆ క్షణంలో అలా జరిగిపోయిందని.. ఇందులో వివాదమేమీ లేదని కొట్టిపడేశాడు. కోచ్‌.. ఫెర్నాండో సైతం.. ‘‘కొరియా ప్లేయర్‌ అలా అనడంతో రొనాల్డోకు కోపం వచ్చింది. 

అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. అతడు రొనాల్డోను అవహేళన చేశాడు. మైదానాన్ని వీడాలని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, స్విస్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఫెర్నాండో మాట్లాడుతూ.. ఆ వివాదం ముగిసింది.. కానీ నాకైతే అదంతా నచ్చలేదని పేర్కొన్నాడు. 

ఎందుకు పక్కనపెట్టారు?
ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం చర్చకు తావిచ్చింది. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రొనాల్డో గర్ల్‌ఫ్రెం‍డ్‌ ఈ మేరకు స్పందించడం గమనార్హం.

కాగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఎల్లో జెర్సీ వేసుకుని సబ్‌స్టిట్యూట్‌ బెంచ్‌ మీద నిర్లిప్తతో రొనాల్డో కూర్చుని ఉన్న దృశ్యాలు చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక మ్యాచ్‌ 74వ నిమిషంలో రొనాల్డో.. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం పీప్‌.. రొనాల్డో చేతికి కెప్టెన్‌ ఆర్మ్‌బ్యాండ్‌ను చుట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు వ్యూహాల్లో భాగంగానే రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసినట్లు కోచ్‌ ఫెర్నాండో చెప్పడం కొసమెరుపు.

చదవండి: FIFA WC 2022: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్‌తో..
IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్‌.. 151 కిమీ వేగంతో బౌలింగ్‌! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌

మరిన్ని వార్తలు