FIFA WC 2022: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్‌

20 Nov, 2022 07:51 IST|Sakshi

లక్షల్లో జనాభా ఉన్న చిన్నచిన్న దేశాలు  కూడా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అర్హత సాధించి తమ ప్రత్యేకతను చాటుకుంటుంటే.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ మాత్రం ఏనాడూ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 106వ స్థానంలో ఉంది. క్రికెట్‌ ఆదరణ పెరిగాక మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్‌ కూడా ఒకటి. 

ప్రతి నాలుగేళ్లకు ప్రపంచకప్‌లో ఒక్క కొత్త జట్టయినా గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తుంటే భారత ఫుట్‌బాల్లో మాత్రం కదలిక కనిపించదు. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఇండియన్‌ సూపర్‌ లీగ్, ఐ–లీగ్‌ తదితర టోర్నీలతో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్‌ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది.

1951, 1962 ఆసియా క్రీడ్లలో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అయితే 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. అప్పుడప్పుడు దక్షిణాసియా (శాఫ్‌) దేశాల పోటీల్లో మెరుపులు మినహా మిగతాదంతా శూన్యమే. బైచుంగ్‌ భూటియా, సునీల్‌ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే వ్యక్తిగత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. 

1950లో ఏమైందంటే...
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ వచ్చిన ప్రతిసారీ అయ్యో మన జట్టూ ఉంటే బాగుండేదని సగటు క్రీడాభిమాని ఆశపడతాడు. అయితే 72 ఏళ్ల క్రితం 1950 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌కు ఆడే అవకాశం దక్కింది. కానీ మన టీమ్‌ మాత్రం టోర్నీలో పాల్గొనలేకపోయింది. దీనికి సంబంధించి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1950లో ప్రపంచ కప్‌ను బ్రెజిల్‌లో నిర్వహించారు. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు ఎక్కువ దేశాలు ఆసక్తి చూపించలేదు. క్వాలిఫయింగ్‌లో 33 జట్లే పోటీ పడ్డాయి. దాంతో మన జట్టు క్వాలిఫయింగ్‌లో బర్మా, ఫిలిప్పీన్స్‌ల గ్రూప్‌లో నిలిచింది. ఆ రెండు జట్లు తప్పుకోవడంతో భారత్‌ ఆటోమెటిక్‌గా అర్హత సాధించింది. కానీ చివరి నిమిషంలో టోర్నీ నుంచి భారత్‌ తప్పుకుంది.

ఏఐఎఫ్‌ఎఫ్‌ అధికారిక వివరణ ప్రకారం... జట్టు ఎంపికపై భేదాభిప్రాయాలు, తగినంత ప్రాక్టీస్‌ సమయం లేకపోవడం దీనికి కారణాలు. సుదీర్ఘ విరామం తర్వాత 1986లో భారత  జట్టు ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించింది. అప్పటి నుంచి అన్ని సార్లూ బరిలోకి దిగినా... ఒక్కసారి కూడా ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. 2026 ప్రపంచకప్‌ నుంచి 32 జట్లకు కాకుండా 48 జట్లకు ప్రధాన టోర్నీలో ఆడే అవకాశం కల్పించాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. ఆసియా నుంచి ఎనిమిది లేదా తొమ్మిది దేశాలకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రానుంది. దాంతో ఇప్పటి నుంచే అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య 2026 ప్రపంచకప్‌లో బెర్త్‌ సంపాదించాలనే లక్ష్యంతో సన్నాహాలు మొదలుపెట్టాలి. 

మరిన్ని వార్తలు