FIFA World Cup 2022: ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ఎందుకంటే..? 

1 Dec, 2022 17:01 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్ని జట్లు తమ ఆఖరి గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) ఒకే సమయంలో ఎందుకు ఆడతాయన్న విషయం చాలామంది సాకర్‌ ఫాలోవర్స్‌కు అర్ధం కాకపోవచ్చు. అయితే దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందన్నది అందరూ తెలుసుకోవాలి.

వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌ వేదికగా జరిగిన 1982 వరల్డ్‌కప్‌లో అల్జీరియా తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు వెస్ట్‌ జర్మనీ, ఆస్ట్రియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉన్నాయి. దీంతో గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ ముగిసిన అల్జీరియా, ఆ మ్యాచ్‌ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూసింది.

ఆ మ్యాచ్‌లో పటిష్టమైన వెస్ట్‌ జర్మనీ రెండు గోల్స్‌ తేడాతో గెలిస్తే అల్జీరియా తర్వాతి రౌండ్‌కు చేరుతుంది. ఈ క్రమంలో ఆట మొదలయ్యాక 11 నిమిషాల్లోనే గోల్‌ చేసిన వెస్ట్‌ జర్మనీ.. ఆ తర్వాత గోల్‌ చేసే అవకాశం వచ్చినా ఉదాసీనంగా వ్యవహరించి, అల్జీరియా ఇంటిదారి పట్టడానికి పరోక్ష కారణమైంది.

కారణం ఏంటంటే.. అల్జీరియా తమ గ్రూప్‌ దశ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో వెస్ట్‌ జర్మనీపై విజయం సాధించింది. ఈ అక్కసుతో వెస్ట్‌ జర్మనీ.. అల్జీరియా తదుపరి రౌండ్‌కు చేరకుండా చావు దెబ్బకొట్టింది. వెస్ట్‌ జర్మనీ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ మోసాన్ని అప్పట్లో సాకర్‌ ప్రపంచం మొత్తం వేలెత్తి చూపింది.

వెస్ట్‌ జర్మనీని సస్పెండ్‌ చేయాలని అల్జీరియా.. ఫిఫా గవర్నింగ్‌ బాడీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం‍ లేకుండా పోయింది. ఆ వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన వెస్ట్‌ జర్మనీ.. అల్జీరియాకు చేసిన మోసానికి ఫలితం అనుభవించింది. వెస్ట్‌ జర్మనీ.. నాటి చారిత్రక ఫైనల్లో ఇటలీ చేతిలో 1-3 గోల్స్‌ తేడాతో చావుదెబ్బ తినింది.

అల్జీరియాతో మ్యాచ్‌లో వెస్ట్‌ జర్మనీ తొండాట ఆడిందని విచారణలో తెలుసుకున్న ఫిఫా.. ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ, ఆ తర్వాతి వరల్డ్‌కప్‌ (1986) నుంచి రూల్స్‌ మాత్రం మార్చింది. గ్రూప్‌ స్టేజ్‌లో అన్ని జట్ల తమ చివరి మ్యాచ్‌లు ఒకే సమయంలో ఆడాలని రూల్స్‌ను సవరించింది.

ఇలా చేయడం వల్ల ఏ జట్టు ఉద్దేశపూర్వకంగా మరో జట్టుకు (ఒకే గ్రూప్‌) నష్టం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉండదు. నాకౌట్స్‌కు చేరాలంటే ఓ మ్యాచ్‌ ఫలితంపై మరో జట్టు భవితవ్యం ఆధార పడే ఆస్కారం ఉండదు. నాకౌట్స్‌కు చేరే క్రమంలో ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌ కీలకం కాబట్టి ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. 1986 నుంచి ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌ విషయంలో ఇదే పద్దతి పాటిస్తుంది. 

కాగా, నాటి రూల్‌ ప్రకారం ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ తొలి 8 రోజులు రోజుకు నాలుగేసి మ్యాచ్‌లు, ఒక్కోటి ఒక్కో సమయంలో (మధ్యాహ్నం 3:30, సాయంత్రం 6:30, రాత్రి 9:30, అర్ధరాత్రి 12:30) జరిగాయి. రౌండ్‌ ఆఫ్‌ 16కి (నాకౌట్‌) ముందు జరగాల్సిన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) మాత్రం రెండూ ఒకే సమయంలో (రాత్రి 8:30, అర్ధరాత్రి 12:30) జరుగుతున్నాయి. నవంబర్‌ 29 నుంచి ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు