Kylian Mbappe: 'బాధపడకు మిత్రమా.. ఓడినా చరిత్ర సృష్టించారు'

15 Dec, 2022 12:18 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి మొరాకోతో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో ఫ్రాన్స్‌ విజయం అందుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగిన ఫ్రాన్స్‌ టోర్నీ ఆసాంతం అందుకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తూ వచ్చింది. ఫ్రాన్స్‌ సూపర్‌స్టార్‌ కైలియన్‌ ఎంబాపె గోల్‌ కొట్టడంలో విఫలమైనప్పటికి మేమున్నామంటూ తియో హెర్నాండేజ్‌(ఆట 5వ నిమిషం), రాండల్‌ కొలో మునాయ్‌(ఆట 79వ నిమిషం)లో ఫ్రాన్స్‌కు గోల్‌ అందించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక డిసెంబర్‌ 18(ఆదివారం) జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమితుమీ తేల్చుకోనుంది.

ఇదిలా ఉంటే ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్రికా జట్టు మొరాకో సెమీస్‌ చేరి అందర్ని ఆశ్చర్యపరిచింది. గ్రూప్‌ దశలో బెల్జియం, నాకౌట్స్‌లో స్పెయిన్‌, పోర్చుగల్‌లను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. అయితే ఫ్రాన్స్‌ అనుభవం ముందు మొరాకో తలవంచక తప్పలేదు.. అయినా సరే తమ ఆటతీరుతో ఇంత దూరం వచ్చిన మొరాకో జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ఫ్రాన్స్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె, మొరాకో ఢిపెండర్‌ అచ్రఫ్‌ హకీమిలు బయట బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. దాదాపు ఒకేసారి ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ఆరంభించిన ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరు ఫిఫా వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో మాత్రం ప్రత్యర్థులయ్యారు. దేశం కోసం మ్యాచ్‌ ఆడగా.. ఎంబాపె విజయం సాధించగా.. హకీమి ఓటమి పాలయ్యాడు. మ్యాచ్‌ వరకు మాత్రమే తాము ప్రత్యర్థులమని.. బయట ఎప్పటికీ ప్రాణ స్నేహితులమేనని మరోసారి నిరూపించారు. 

అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలన విజయాలు అందుకున్న తన జట్టు సెమీస్‌లో నిష్క్రమించడంతో హకీమి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇది గమనించిన ఎంబాపె.. అతని వద్దకు వచ్చి ఓదార్చాడు. బాధపడకు మిత్రమా.. ఓడినా మీరు చరిత్ర సృష్టించారు. మేటి జట్లను చిత్తు చేసి ఇంతదూరం రావడం సామాన్యమైన విషయం కాదు. మీ పోరాటం అమోఘం. అయితే మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు మాత్రమే విజయం సాధిస్తుంది. ఇవాళ నీపై నేను పైచేయి సాధించాను. టోర్నీ వరకే ప్రత్యర్థులం.. బయట మాత్రం ఎన్నటికి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఎంబాపె, అచ్రఫ్‌ హకీమిలు తమ జెర్సీలను మార్చుకొని తమ స్నేహం గొప్పతనాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: FIFA WC: సెమీ ఫైనల్‌.. ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులైన వేళ

మరిన్ని వార్తలు