Lionel Messi: 'పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు'

1 Dec, 2022 15:16 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా రౌండ్‌ ఆఫ్‌-16‍కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ బృందం 2-0 తేడాతో ఓడించింది. ప్రీక్వార్టర్స్‌ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే మ్యాచ్‌లో కచ్చితంగా గోల్‌ చేస్తాడనుకున్న మెస్సీ విఫలమైనప్పటికి అర్జెంటీనా మిడ్‌ ఫీల్డర్‌ అలెక్సిస్‌ అలిస్టర్‌(ఆట 46వ నిమిషంలో), ఫార్వార్డ్‌ ప్లేయర్‌ జులియన్‌ అల్వరేజ్‌(ఆట 67వ నిమిషంలో) గోల్‌ అందించి జట్టుకు విజయాన్ని అందించారు.

ఇక మ్యాచ్‌ విజయం అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ''ఈరోజు మా ప్రదర్శన చూసి పైనున్న మారడోనా సంతోషపడి ఉంటాడు. ఎందుకంటే మారడోనా నాపై ఎక్కువ ప్రేమను చూపించేవాడు. నాకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయంటే ఆయనే ఎక్కువ సంతోషపడేవాడు. ఇక తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోయి పూర్తిగా ఒత్తిడిలో ఉన్న మేము వరుస రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం మా ఆటపై నమ్మకాన్ని పెంచింది. ఓటమి బాధ నుంచి ఎలా బయటపడాలో ముందు నాకు తెలియదు.. ఇప్పుడు నేర్చుకున్నా. ఇక రికార్డులు కూడా నా వెంట రావడం సంతోషంగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక స్టార్‌ ఫుట్‌బాలర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లియోనల్‌ మెస్సీకి ఇది 999వ మ్యాచ్‌. అంతేకాదు.. ఫిఫా వరల్డ్‌కప్‌ టోర్నీలో 22వది. ఈ క్రమంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా ఉన్న పేరిట రికార్డును మెస్సీ బద్దలు కొట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్స్‌లో అర్జెంటీనా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.

పెనాల్టీ కిక్‌లను కొట్టడంలో మెస్సీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 39సార్లు మాత్రమే పెనాల్టీని గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. పోలాండ్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని మెస్సీ గోల్‌ పోస్ట్‌లోకి తరలించడంతో విఫలమయ్యాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇదే సమయంలో పెనాల్టీని గోల్‌గా మలచడంలో ఫెయిల్‌ అయిన మెస్సీ తనపై తానే అసహనం వ్యక్తం చేశాడు.

చదవండి: FIFA WC: రికార్డు బద్దలు కొట్టినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ!

మరిన్ని వార్తలు