FIFA World Cup 2022: 144లో ఒక్కటి కూడా ఒరిజినల్‌ కాదు.. అందుకే సీజ్‌

5 Nov, 2022 10:31 IST|Sakshi

ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌‍కప్‌ ఖతార్‌ వేదికగా నవంబర్‌ 20 నుంచి ప్రారంభం కానుంది. ఒక మెగా టోర్నీ జరుగుతుంటే దాని చుట్టూ అంచనాలు ఉండడం సహజం. సాకర్‌ సమరంలో పోటీ పడే ప్రతీ జట్టు అంతిమలక్ష్యం ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ను సాధించడమే. విశ్వవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న ఫుట్‌బాల్‌లో వరల్డ్‌ చాంపియన్‌గా ఎవరు అవతరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఖతార్‌ లాంటి చిన్న దేశానికి ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఆ దేశానికి పెద్ద పండగ లాంటిదే అని చెప్పొచ్చు. అందుకే ఫిఫా వరల్డ్‌కప్‌ ఫేక్‌ ట్రోఫీలతో​ దోహాకు చెందిన ఒక వ్యక్తి వ్యాపారం మొదలెట్టాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ను పోలిన 144 ఫేక్‌ ట్రోఫీలను తయారు చేసి అమ్మాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒక మెగా ఈవెంట్‌కు సంబంధించిన ట్రోఫీని ఇలా బహిరంగ మార్కెట్లో తయారు చేసి అమ్మాలంటే అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా తయారు చేసినందుకే సదరు వ్యక్తి నుంచి 144 ఫేక్‌ ట్రోఫీలను సీజ్‌ చేసినట్లు దేశ ఇంటీరియర్‌ మినిస్ట్రీ తన ట్విటర్‌లో ప్రకటించింది. 

''మాకు పక్కా సమాచారం అందాకే ఫిఫా వరల్డ్‌కప్‌ ఫేక్‌ ట్రోఫీలను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నాం. వారి వద్ద 144 ఫేక్‌ ట్రోఫీలు ఉన్నాయి. వాటిన్నింటిని సీజ్‌ చేశాం. అనుమతి లేకుండా ట్రోఫీలు తయారు చేసిన వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకోవడం జరుగుతుంది.'' అంటూ తెలిపింది. 

ఇక నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు జరగనున్న సాకర్‌ సమరంలో తొలి మ్యాచ్‌ ఆతిథ్య ఖతార్‌, ఈక్వేడార్‌ మధ్య జరగనుంది. మొత్తంగా 32 జట్లు పోటీ పడుతుండగా.. ఎనిమిది గ్రూప్‌లుగా విడిపోనున్నాయి. ప్రతీ గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో ప్రతీ జట్టు రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో మూడు సింగిల్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు  మొత్తంగా 16 జట్లు రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎనిమిది జట్లు క్వార్టర్స్‌కు, ఆపై సెమీస్‌లో నాలుగు జట్లు తలపడతాయి. ఇక సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు డిసెంబర్‌ 18న లుసైల్‌లోని లుసైల్‌ ఐకానిక్‌ స్టేడియంలో జరగనున్న ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి.

చదవండి: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు