FIFA WC 2022: మెస్సీకి అగ్ని పరీక్ష.. పోలాండ్‌ చేతిలో ఓడితే!

30 Nov, 2022 19:10 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిపా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బుధవారం అగ్నిపరీక్ష ఎదుర్కోనుంది. ఇవాళ అర్థరాత్రి దాటిన తర్వాత పోలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో అర్జెంటీనా కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ​ ఓడితే మాత్రం ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెస్సీకి ఇదే చివరి ఫిఫా వరల్డ్‌కప్‌ అని భావిస్తున్న తరుణంలో అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్‌కు చేరాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

అయితే గ్రూప్‌-సిలో అర్జెంటీనా సహా మిగతా అన్ని జట్లకు కూడా రౌండ్‌ ఆఫ్‌-16 అవకాశాలున్నాయి. అయితే చివరకు రెండు జట్లు మాత్రమే ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. మరి ఆ రెండు జట్లు ఏవి అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. 

అర్జెంటీనా, పోలాండ్‌కు ఎంత అవకాశం?
బుధవారం జరగబోయే మ్యాచ్‌లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్‌ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్‌ సిలో టాపర్‌గా ఉన్న పోలాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్తుంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌ డ్రా అయితే రాబర్ట్‌ లెండోవాస్కీ నేతృత్వంలోని పోలాండ్‌ రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్తుంది. అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్‌ డిఫరెన్స్‌తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్‌ డ్రా కావాలి.

సౌదీ అరేబియా, మెక్సికో
సౌదీ అరేబియా నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్‌ ఆఫ్‌ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్‌ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్‌ డిఫరెన్స్‌లో పైచేయి సాధించాలి. అయితే సౌదీ అరేబియాతో పోలిస్తే మెక్సికోకు నాకౌట్‌ చేరే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.

ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్రీ క్వార్టర్స్ చేరాలంటే పోలాండ్‌ను కచ్చితంగా ఓడించాల్సిందే. ఇక తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతుల్లో ఓడడం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇప్పటికే బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌లాంటి జట్లు రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్‌-ఏ నుంచి నెదర్లాండ్స్‌, సెనెగల్.. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్, అమెరికాలు ప్రీ క్వార్టర్స్‌లో  అడుగుపెట్టాయి.

చదవండి: Lionel Messi: ఒక్క మ్యాచ్‌.. మూడు రికార్డులు బద్దలు కొట్టే అవకాశం

FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు

పంత్‌కు గాయం.. బంగ్లా టూర్‌కు దూరం!

మరిన్ని వార్తలు