FIFA WC 2022: పాపం.. గోల్‌ కొట్టినా సెలబ్రేట్‌ చేసుకోలేక

24 Nov, 2022 17:58 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆటగాడు గోల్‌ కొట్టాడంటే దానిని గొప్పగా చూస్తారు. మాములు మ్యాచ్‌ల్లో గోల్‌ కొడితే పెద్దగా కిక్‌ రాదు. కానీ ఫిఫా వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు అలా కాదు. ఎందుకంటే నాలుగేళ్లకోసారి జరిగే సాకర్‌ సమరంలో గోల్స్‌ కొట్టిన ఆటగాడు హీరో అయితే కొట్టనివాడు జీరో అవుతాడు. ఇది మొదటినుంచి వస్తున్న సంప్రదాయమే. ఒక ఆటగాడు గోల్‌ కొడితే అది చూసిన అభిమానులు కేరింతలు, ఈలలు, గోలతో రెచ్చిపోతారు. మరి గోల్‌ కొట్టిన ఆటగాడి సెలబ్రేషన్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

అయితే తాజాగా గురువారం స్విట్జర్లాండ్‌, కామెరున్‌ మ్యాచ్‌లో గోల్‌ కొట్టిన ఒక ఆటగాడు మాత్రం దానిని సెలబ్రేట్‌ చేసుకోలేకపోయాడు. అతనే స్విట్జర్లాండ్‌ స్రైకర్‌ బ్రీల్‌ ఎంబోలో. ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ 1-0 తేడాతో కామెరున్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో నమోదైన ఒక్క గోల్‌ కూడా బ్రీల్‌ ఎంబోలో చేసిందే. అతని గోల్‌ పుణ్యానే ఇవాళ స్విట్జర్లాండ్‌ మ్యాచ్‌ను గెలిచింది. మరి ఇంత చేసిన బ్రీల్‌ ఎంబోలో ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోలేదా అనే డౌట్‌ వస్తుంది.

కారణం అతను గోల్‌ కొట్టింది తన స్వంత దేశమైన కామెరున్‌పై కావడమే. బ్రీల్‌ ఎంబోలో స్వస్థలం కామెరున్‌.. ఇప్పటికి అతని తల్లిదండ్రులు కామెరున్‌ వెళ్లి వస్తుంటారు. ఎంబోలో కూడా అక్కడే పుట్టి పెరిగాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల స్విట్జర్లాండ్‌కు రావాల్సి వచ్చింది. ఇక్కడే ఫుట్‌బాల్‌ కెరీర్‌ను ఆరంభించి ఇప్పుడు స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందుకే జట్టుకు గోల్‌ అందించినప్పటికి సొంత దేశంపై ఆ గోల్‌ రావడంతో సెలబ్రేషన్‌ చేసుకోలేకపోయాడు. 

చదవండి: FIFA WC: స్విట్జర్లాండ్‌ శుభారంభం.. కామెరున్‌పై విజయం

మరిన్ని వార్తలు