FIFA World Cup 2022: ఆటతో అదరగొట్టారు.. సంచలన ప్రదర్శన.. ఉత్కంఠ

9 Dec, 2022 02:29 IST|Sakshi

17 రోజులలో 56 మ్యాచ్‌లు...ఎన్నో ఉత్కంఠ మలుపులు, ఎన్నో ఉద్వేగభరిత క్షణాలు... 32తో మొదలైన సమరం ఇప్పుడు 8 జట్లకు చేరింది. లెక్కకు మిక్కిలి ఖర్చుతో ఆతిథ్యం ఇచ్చినా ఒక్క మ్యాచ్‌ గెలవలేని ఖతర్‌ నిరాశపర్చగా... అర్జెంటీనాకు షాక్‌ ఇచ్చినా ముందంజ వేయలేని సౌదీ అరేబియా, నాలుగు సార్లు చాంపియన్‌ జర్మనీ నిష్క్రమణ తొలి రౌండ్‌లో హైలైట్‌గా నిలిచాయి. నాకౌట్‌ పోరులో రెండు మ్యాచ్‌లలో పెనాల్టీల ద్వారా ఫలితం తేలగా... క్రొయేషియా గోల్‌ కీపర్‌ ఆట, మొరాకో సంచలన ప్రదర్శన అభిమానులు మరచిపోలేరు. క్వార్టర్స్‌ సమరానికి వెళ్లే ముందు ఇప్పటి వరకు సాగిన ఆటను చూస్తే...

ఎన్నో ఏళ్లుగా అర్జెంటీనా తరఫున లయోనల్‌ మెస్సీ అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ వరల్డ్‌ కప్‌తో ఆ జట్టులో కూడా కొత్త హీరోలు పుట్టుకొచ్చారు. అలెక్సిన్‌ మ్యాక్, ఎన్జో ఫెర్నాండెజ్, జూలియాన్‌ అల్వారెజ్‌ కీలక సమయాల్లో మెరుపు ప్రదర్శనతో జట్టును క్వార్టర్స్‌కు చేర్చారు. కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ జోరు ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో ఆటను చూస్తే 1982 తర్వాత ఈ తరహా దూకుడు చూడలేదని కొందరు మాజీ బ్రెజిల్‌ ఆటగాళ్లే చెప్పారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ నాలుగు గోల్స్‌ అద్భుతంగా, ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. రిచర్లిసన్‌ రూపంలో మరో స్టార్‌ ఉదయించాడు. టీమ్‌ తరఫున మూడు గోల్స్‌ చేసిన రిచర్ల్‌సన్‌... రొనాల్డో రిటైర్మెంట్‌ తర్వాత తమకు ‘9వ నంబర్‌ జెర్సీ’ రూపంలో లభించిన వరమని బ్రెజిల్‌ అభిమానులు చెబుతున్నారు.  

యువ ఆటగాళ్ల జోరు... 
గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియా ఈ సారి యువ ఆటగాళ్ల ప్రదర్శనతో చెలరేగింది. 2018 టోర్నీలో ల్యూకా మోడ్రిక్‌ ఒంటి చేత్తో జట్టును ఫైనల్‌ చేర్చగా...ఈ సారి అతనికి తోడు మరికొందరు జూనియర్లు జత కలిశారు. అటాకింగ్‌లో మార్కో లివాజా ఆకట్టుకోగా, జోస్కో గ్వార్డియల్‌కు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ డిఫెండర్‌’ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. అతని కోసం యూరోపియన్‌ క్లబ్‌లు భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గోల్‌ కీపర్‌ డొమినిక్‌ లివకోవిక్‌ కూడా పెనాల్టీ సేవింగ్‌ స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జపాన్‌తో మ్యాచ్‌లో ఇది కనిపించింది. కైల్‌ ఎంబాపె ఈ వరల్డ్‌ కప్‌లో ఫ్రాన్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. 5 గోల్స్‌ సాధించిన అతను 2 గోల్స్‌లో సహకారం అందించాడు. అతని ప్రదర్శన ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా నిలిపేలా కనిపిస్తోంది. 1986 ప్రపంచకప్‌లో మారడోనా తరహాలో జట్టులోని ఒకే ఆటగాడు ప్రభావం చూపించిన తీరుతో విశ్లేషకులు ఇప్పుడు ఎంబాపె ఆటను పోలుస్తున్నారు. ఉస్మాన్‌ ఎంబెలె ఈ టోర్నీలో సత్తా చాటిన మరో ఫ్రాన్స్‌ ఆటగాడు.  

మొరాకో మెరుపులు... 
ప్రపంచకప్‌ మొత్తానికి హైలైట్‌గా నిలిచే ప్రదర్శన మొరాకోదే. అనూహ్యమైన ఆటతో దూసుకొచ్చి తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆ జట్టు క్వార్టర్స్‌ చేరింది. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తోనే టీమ్‌ ముందంజ వేయగలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి ఆ జట్టు ఒకే ఒక గోల్‌ ఇచ్చింది. అదీ సెల్ఫ్‌ గోల్‌ మాత్రమే!  2018లో అత్యధిక గోల్స్‌ చేసిన బెల్జియం, రన్నరప్‌ క్రొయేషియాతో పాటు ప్రిక్వార్టర్స్‌లో 2010 చాంపియన్‌ స్పెయిన్‌ను చిత్తు చేసిన తీరు అసమానం.ఇంగ్లండ్‌ జట్టులో సమష్టితత్వం బాగా కనిపించింది. జట్టు ఇప్పటి వరకు మొత్తం 12 గోల్స్‌ స్కోర్‌ చేయగా, వాటిని ఏడుగురు వేర్వేరు ఆటగాళ్లు సాధించారు. గత వరల్డ్‌ కప్‌లో ఒక్క హ్యారీ కేన్‌ మాత్రమే 6 గోల్స్‌ చేయగా, ఈ సారి అతను ఒకే ఒక గోల్‌ చేసినా... జట్టు మాత్రం దూసుకుపోతోంది.  

పోర్చుగల్‌ జట్టు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో చూపిన ప్రదర్శనతో ‘వన్‌ మ్యాన్‌ షో’కు తెర పడినట్లయింది. స్విట్జర్లాండ్‌పై 6–1తో విజయం వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. తమ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను పక్కన పెట్టి టీమ్‌ చూపిన తెగువ మంచి ఫలితాన్ని ఇచ్చింది. గొన్సాలో రామోస్‌ రూపంలో కొత్త స్టార్‌ ఉద్భవించాడు. ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో చేసిన హ్యాట్రిక్‌తో అతను క్లబ్‌ ఫుట్‌బాల్‌లో ఒక్కసారిగా హాట్‌ స్టార్‌గా మారిపోయాడు. జొవా ఫెలిక్స్, బెర్నార్డో సిల్వ కూడా సత్తా చాటి పోర్చుగల్‌ టైటిల్‌ ఆశలు పెంచారు.        
- సాక్షి క్రీడా విభాగం    

ఐదు సార్లు విజేత అయిన బ్రెజిల్‌ ఈ సారి కూడా ఫేవరెట్‌గానే ఉంది. క్వార్టర్స్‌ పోరులో ఆ జట్టు గత టోర్నీ రన్నరప్‌ క్రొయేషియాను ఎదుర్కొంటుంది. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో మూడో సారి తలపడనుండగా, నాకౌట్‌ దశలో తలపడటం ఇదే తొలిసారి. గత రెండు మ్యాచ్‌లలో కూడా బ్రెజిల్‌ (1–0తో 2006లో, 3–1తో 2014లో) విజేతగా నిలిచింది. కోచ్‌ టిటె నాయకత్వంలో అటాకింగ్‌నే నమ్ముకొని బ్రెజిల్‌ ఫలితాలు సాధించింది.

ఇప్పటి వరకు సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు స్టార్‌ ప్లేయర్‌ నెమార్, అలెక్‌ సాండ్రో కూడా రాణిస్తే బ్రెజిల్‌కు తిరుగుండదు. క్రొయేషియా రికార్డును బట్టి చూస్తే ఫామ్‌లో ఉన్న బ్రెజిల్‌ను నిలువరించడం అంత సులువు కాదు. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సంచలనాలకు లోటేమీ లేదు. మోడ్రిక్, కొవాసిక్‌తో పాటు బ్రొజోవిక్‌ ప్రదర్శనపై జట్టు ఆధారపడుతోంది.  
  
మరో మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే  ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడైన మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అన్నీ సాధించిన మెస్సీకి వరల్డ్‌ కప్‌ మాత్రం ఇంకా కలే. తన ఐదో ప్రయత్నంలోనైనా దీనిని సాధించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ సారి అంతే స్థాయిలో రాణిస్తున్న అల్వారెజ్‌పై కూడా జట్టు బాగా ఆధారపడుతోంది.

వ్యూహం ప్రకారం చూస్తే నెదర్లాండ్స్‌ ఒక్క మెస్సీని నిలువరిస్తే సరిపోదు. మరో వైపునుంచి అల్వారెజ్‌ దూసుకుపోగలడు. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్‌ కోచ్‌ వాన్‌ గాల్‌ నేతృత్వంలో ఒక్కసారిగా పటిష్టంగా మారింది. అతని కోచింగ్‌లో డచ్‌ బృందం 19 మ్యాచ్‌లలో ఒక్కటి ఓడిపోలేదు. ఫ్రెంకీ డో జోంగ్, డెన్జెల్‌ డంఫ్రైస్‌ కీలక ఆటగాళ్లు. ఇరు జట్ల మధ్య వరల్డ్‌కప్‌లో 5 మ్యాచ్‌లు జరగ్గా...అర్జెంటీనా 3, నెదర్లాండ్స్‌ 1 గెలిచాయి. మరో మ్యాచ్‌ డ్రా అయింది.     

మరిన్ని వార్తలు