మెస్సీ మ్యాజిక్కా.. అదృష్టమా.. ఎంబాపె అల్లాడించాడు

19 Dec, 2022 18:13 IST|Sakshi

మొత్తానికి మెస్సీ అభిమానుల ఆశ ఫలించింది. అర్జెంటీనా మేటి ఆటగాడు లియోనల్‌ మెస్సీ చిరకాల వాంఛ నెరవేరింది. మెస్సీ ఫ్యాన్స్‌కు అర్జెంటీనా ‘ఖతర్‌’నాక్‌ విజయం అమితానందాన్ని కలిగించింది. ఫిఫా ప్రపంచకప్‌ 2022 విజేతగా అర్జెంటీనా నిలవడంతో అభిమానుల సంబరాలు ఆకాశన్నంటాయి. 


అర్జెంటీనా గెలిచినప్పటికీ ఫ్రాన్స్‌ పోరాటస్ఫూర్తిని కూడా పలువురు అభినందిస్తున్నారు. ఆట మొత్తంగా చూస్తే అర్జెంటీనా కంటే ఫ్రాన్స్‌ మెరుగ్గా ఆడిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఆట మొదటి అర్ధభాగంలో వెనుకబడినప్పటికీ పుంజుకుని పెనాల్టీ షూటౌట్‌ వరకు తీసుకెళ్లడం ఫ్రాన్స్‌ పోరాట పటిమకు నిదర్శమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అర్జెంటీనా తప్పిదం వల్ల మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌ వరకు వెళ్లిందన్న వాదనలు విన్పిస్తున్నాయి. కైలియన్ ఎంబాపె అయితే అదరగొట్టాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. 


‘ఫస్ట్ హాఫ్ అంతా అర్జెంటీనా దే గేమ్. అర్జెంటీనా డిఫెన్స్‌ను ఫ్రాన్స్ ఛేదించలేకపోయింది. ఫస్ట్‌ హాఫ్‌లో ఫ్రాన్స్ గోల్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ అర్జెంటీనాకు చాలా అవకాశాలు వచ్చాయి. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌ను అర్జెంటీనా పెనాల్టీ షూట్ అవుట్ వరకు తెచ్చుకుంది. అలా గెలవాలని కోరుకోరు కూడా. ఏదేమైనా గెలుపు గెలుపే. కంగ్రాట్స్‌ టు అర్జెంటీనా’ అంటూ నెటిజన్‌ ఒకరు వ్యాఖ్యానించారు. 


‘మొదట దెబ్బలు తిని తర్వాత కౌంటర్‌ అటాక్‌ చేసేవారిపై సానుభూతి చూపడం మానవ సహజం. అయితే మొదటి నుంచే సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై దాడులు ద్వారా అర్జెంటీనాయే ఒకట్రెండు శాతం ఎక్కువ పైచేయి సాధించింద’ని మరొకరు అభిప్రాయపడ్డారు.

‘అర్జెంటీనా ఆఖరి 12 నిమిషాలు అజాగ్రత్తగా ఆడింది. ఆట మొదటి 65 నిమిషాల వరకు ఫ్రాన్స్‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వని మెస్సీ టీమ్‌ చివరలో మాత్రం కాస్త తడబడింది. ఏమైనా మ్యాచ్‌ మాత్రం సూపర్’ అంటూ ఇంకొరు పేర్కొన్నారు. 


‘ఆట మొదటి అర్ధభాగం మొత్తంలో ఫ్రాన్స్ ప్రత్యర్థి గోల్ మీద ఒక షాట్ కూడా కొట్టలేదు. బాల్ 31% సమయం మాత్రమే ఫ్రాన్స్ అధీనంలో ఉంది. అర్జెంటీనా పూర్తిగా డామినేట్ చేసింది. కీలక సమయంలో పెనాల్టీలు ఫ్రాన్స్‌కు కలిసివచ్చాయి. వ్యక్తిగత గోల్స్‌ మాత్రం మెస్సీ మ్యాజిక్‌. ఎంబాపె అల్లాడించాడు. చివరలో అర్జెంటీనా గోల్‌ కీపర్‌ జట్టును సేవ్‌ చేశాడ’ని పలువురు వ్యాఖ్యానించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా మ్యాచ్‌ మాత్రం తమను ఎంతగానో అలరించిందని క్రీడాభిమానులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఫుట్‌బాట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఊహించిన దానికన్నా తమను ఉత్కంఠకు గురిచేసిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’!)

మరిన్ని వార్తలు