FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే... కారణమిదే!

13 Aug, 2022 08:42 IST|Sakshi

FIFA World Cup 2022 Qatar- జెనీవా: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2022 మెగా టోర్నీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసింది. ఈ ఏడాది నవంబర్‌ 21న టోర్నమెంట్‌ ప్రారంభం కావాల్సి ఉండగా దానిని ఒక రోజు ముందుకు జరిపారు. దాంతో నవంబర్‌ 20నే పోటీలు మొదలవుతాయి. పాత షెడ్యూల్‌ ప్రకారం సెనెగల్, నెదర్లాండ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ మొదలు కావాల్సి ఉంది.

అయితే సుదీర్ఘ కాలంగా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ లేదా ఆతిథ్య జట్టు బరిలోకి దిగడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానిని కొనసాగించాలని భావిస్తూ నవంబర్‌ 20 (ఆదివారం) ఆతిథ్య ఖతర్‌ జట్టు మ్యాచ్‌ ఉండేలా ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) తేదీని సవరించింది. 60 వేల సామర్థ్యం గల అల్‌ బైత్‌ స్టేడియంలో జరిగే తొలి పోరులో ఈక్వెడార్‌తో ఖతర్‌ తలపడుతుంది.

అదే రోజు మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. తొలి మ్యాచ్‌కు కేవలం 100 రోజుల ముందు ఈ అనూహ్య మార్పు జరపడం టోర్నీకి సంబంధం ఉన్న చాలా మందికి ఇబ్బందిగా మారుతుందని విమర్శలు వస్తున్నాయి. స్పాన్సర్లు, ఆతిథ్యం, ఫ్లయిట్‌ బుకింగ్‌లు తదితర అంశాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని మార్కెటింగ్‌ వర్గాలు చెబుతుండగా... తాము వాటిని పరిష్కరిస్తామని ‘ఫిఫా’ హామీ ఇస్తోంది.  

చదవండి: Rohit Sharma: రోహిత్‌ శర్మ సాధించిన ఈ 3 రికార్డులు బద్దలు కొట్టడం కోహ్లికి సాధ్యం కాకపోవచ్చు!
Abhinav Bindra: 34 ఏళ్లకే ఎందుకు రిటైర్మెంట్‌?.. మూడు ముక్కల్లో సమాధానం

మరిన్ని వార్తలు