FIFA World Cup 2022: అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాళ్లెవరంటే?

11 Nov, 2022 22:14 IST|Sakshi

మరో రెండు రోజుల్లో టి20 వరల్డ్‌కప్‌ ముగియనుంది. ఇప్పటివరకు ఫోర్లు, సిక్సర్లు కౌంట్‌ చేసిన నోటితోనే గోల్స్‌ కౌంట్‌ చేయాల్సి ఉంటుంది. టి20 వరల్డ్‌కప్‌ ముగిసిన వారం రోజులకు మరో మెగా సమరం మొదలుకానుంది. క్రికెట్‌ కంటే కాస్త ఎక్కువే క్రేజ్‌ ఉన్న క్రీడ ఫుట్‌బాల్‌. మాములు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతూనే అభిమానులకు పూనకాలు వస్తాయి. మరి అలాంటిది సాకర్‌ సమరానికి(ఫిఫా వరల్డ్‌కప్‌) సెపరేట్‌ క్రేజ్‌ ఉంటుంది.

ఎందుకంటే అప్పటివరకు మనకు తెలిసిన స్టార్స్‌ను ఉమ్మడిగా వేర్వేరు జట్లలో చూస్తుంటాం. కానీ ఫిఫా వరల్డ్‌కప్‌ అనగానే దేశం తరపున ఆడడానికి ఆటగాళ్లు సిద్ధమవుతారు. మరి అంత క్రేజ్‌ ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ గురించి మాట్లాడుకుంటే.. 1930 నుంచి ఇప్పటి వరకూ 21 ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలు జరిగాయి. మరి ఇప్పటి వరకూ ఈ టోర్నీల్లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్స్‌  ఎవరనేది ఒకసారి పరిశీలిద్దాం.

మిరొస్లావ్‌ క్లోజ్‌
ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా జర్మనీ స్ట్రైకర్‌ మిరొస్లావ్‌ క్లోజ్‌ నిలుస్తాడు. అతడు ఇప్పటి వరకూ వరల్డ్‌కప్‌లలో 24 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 16 గోల్స్‌తో టాప్‌లో ఉన్నాడు. క్లోజ్‌ నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. ఈ 24 మ్యాచ్‌లలో 63సార్లు అతడు గోల్డ్‌పోస్ట్‌పై దాడి చేసి 16 గోల్స్‌ చేయడం విశేషం. అంటే ప్రతి నాలుగు షాట్లలో ఒకదానిని అతడు గోల్‌గా మలిచాడు.

రొనాల్డో లూయిస్‌ నజారియో డె లిమా

మిరొస్లావ్‌ క్లోజ్‌కు ముందు అత్యధిక గోల్డ్స్‌ రికార్డు బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ రొనాల్డో పేరిట ఉండేది. రొనాల్డో చివరిసారి 2002లో వరల్డ్‌కప్‌ గెలిచిన బ్రెజిల్‌ టీమ్‌లో సభ్యుడు. అతడు మూడు టోర్నీల్లో 19 మ్యాచ్‌లలోనే 15 గోల్స్‌ చేయడం విశేషం. 1998లో తాను ఆడిన తొలి వరల్డ్‌కప్‌లో నాలుగు గోల్స్‌ చేశాడు. ఇక 2002లో అయితే ఏడు మ్యాచ్‌లలోనే 8 గోల్స్‌ చేసిన గోల్డెన్‌ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. అతని ప్రదర్శనతోనే 2002లో బ్రెజిల్‌ ఖాతాలో ఐదో టైటిల్‌ వచ్చి చేరింది.

గెర్డ్‌ ముల్లర్‌

జర్మనీ లెజెండరీ ప్లేయర్‌ గెర్డ్‌ ముల్లర్‌ 14 వరల్డ్‌కప్‌ గోల్స్‌ చేశాడు. కేవలం రెండు వరల్డ్‌కప్‌లలో అతడు ఇన్ని గోల్స్‌ చేయడం విశేషం. 1970 వరల్డ్‌ప్‌లో 10 గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలుచుకున్నాడు. 1970 తర్వాత ముల్లర్‌ చేసినన్ని గోల్స్‌ మరే ఇతర వరల్డ్‌కప్‌లో ఏ ఆటగాడు  కూడా చేయలేదు.

జస్ట్‌ ఫాంటెయిన్‌

ఫ్రాన్స్‌ స్ట్రైకర్‌ ఫాంటెయిన్‌కు ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన రికార్డు ఉంది. అతడు 1958 వరల్డ్‌కప్‌లో ఏకంగా 13 గోల్స్‌ చేశాడు. అతడు ఆడిన ఏకైక వరల్డ్‌కప్‌ ఇదే కావడం గమనార్హం.

పీలే

బ్రెజిల్‌ లెజెండరీ ప్లేయర్‌ పీలే వరల్డ్‌కప్‌లలో 12 గోల్స్‌ చేశాడు. అతడు నాలుగు వరల్డ్‌కప్‌లు ఆడాడు. అతడు ఎప్పుడూ గోల్డెన్‌ బూట్‌ అవార్డు గెలవకపోయినా.. 1970లో బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఆ టోర్నీలో నాలుగు గోల్స్‌ చేయడంతోపాటు ఆరు గోల్స్‌ కావడంలో సాయపడ్డాడు.

ఇప్పుడు ఖతార్‌లో జరగబోయే వరల్డ్‌కప్‌లో అందరి కళ్లూ థామస్‌ ముల్లర్‌, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్‌ సురెజ్‌, లియోనెల్ మెస్సీ, కరీమా బెంజెమా లపైనే ఉన్నాయి. ముల్లర్‌ ఖాతాలో 10 గోల్స్‌ ఉండగా.. రొనాల్డో 7, మెస్సీ 6 గోల్స్ చేశారు.

మరిన్ని వార్తలు