FIFA World Cup Qatar 2022: ఫ్రాన్స్‌ సూపర్‌ షో

24 Nov, 2022 05:58 IST|Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌ శుభారంభం

ఆస్ట్రేలియాపై 4–1తో ఘనవిజయం

రెండు గోల్స్‌తో మెరిసిన జిరూడ్‌  

అల్‌ వాక్రా (ఖతర్‌): వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిచి 60 ఏళ్లయింది. బ్రెజిల్‌ పేరిట ఉన్న ఈ ఘనతను తాము కూడా సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ తొలి పరీక్షలో పాస్‌ అయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్‌ ‘డి’ లీగ్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ జట్టు 4–1 గోల్స్‌ తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఫ్రాన్స్‌ తరఫున ఒలివియర్‌ జిరూడ్‌ (32వ, 71వ ని.లో) రెండు గోల్స్‌ సాధించగా... అడ్రియన్‌ రాబియోట్‌ (27వ ని.లో), ఎంబాపె (68వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. ఆస్ట్రేలియా తరఫున    ఏకైక గోల్‌ను క్రెయిగ్‌ గుడ్‌విన్‌ (9వ ని.లో) సాధించాడు.   

షాక్‌ నుంచి తేరుకొని...
వరుసగా ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మైదానంలో అభిమానులందరూ పూర్తిగా సర్దుకొని కూర్చునేలోపే ఖాతా తెరిచింది. ఆట తొమ్మిదో నిమిషంలో కుడి వైపు నుంచి లెకీ అందించిన పాస్‌ను క్రెయిగ్‌ గుడ్‌విన్‌ లక్ష్యానికి చేర్చడంతో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో అభిమానులకు మరో సంచలన ఫలితం తప్పదా అనే అనుమానం కలిగింది. అయితే ఫ్రాన్స్‌ జట్టు వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు పగ్గాలు వేసింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించి 2–1తో ఆధిక్యాన్ని అందుకుంది.

27వ నిమిషంలో ఎడమ వైపు నుంచి థియో హెర్నాండెజ్‌ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న ఆడ్రియన్‌ రాబియోట్‌ హెడర్‌ షాట్‌తో ఆస్ట్రేలియా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించాడు. 32వ నిమిషంలో ఎడమ వైపు నుంచి రాబియోట్‌ అందించిన పాస్‌ను ఒలివియర్‌ జిరూడ్‌ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్‌ 2–1తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ ఫ్రాన్స్‌ ఆధిపత్యం కనబరిచింది. ఈసారి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించి ఆస్ట్రేలియాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో ఫ్రాన్స్‌ జట్టుకు మూడు పాయింట్లు లభించాయి.
51 ఆస్ట్రేలియాపై రెండు గోల్స్‌ చేసిన క్రమంలో ఒలివియర్‌ జిరూడ్‌ ఫ్రాన్స్‌ తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

మరిన్ని వార్తలు