FIFA World Cup Qatar 2022: ‘ఘన’మైన విజయం

29 Nov, 2022 01:15 IST|Sakshi

3–2తో కొరియాపై ఘనా సంచలన విజయం

రెండు గోల్స్‌తో గెలిపించిన కుడూస్‌ 

దోహా: తొలి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరకు పోర్చుగల్‌ ముందు తలొగ్గిన ఆఫ్రికా దేశం ఘనా తర్వాతి పోరులో సత్తా చాటింది. తమకంటే బలమైన, ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణ కొరియాను చిత్తు చేసి గ్రూప్‌ ‘హెచ్‌’లో సమరాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఘనా 3–2 గోల్స్‌ తేడాతో కొరియాపై విజయం సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ కుడూస్‌ (34వ, 68వ ని.లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, మొహమ్మద్‌ సలిసు (24వ ని.లో) మరో గోల్‌ చేశాడు. కొరియా ఆటగాడు చో గూసంగ్‌ (58వ, 61వ ని.లో) రెండు గోల్స్‌ సాధించాడు.
 
ఘనా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఫార్వర్డ్‌లు దూసుకుపోవడంతో తొలి 24 నిమిషాల్లోనైతే బంతి పూర్తిగా కొరియా ఏరియాలోనే కనిపించింది. చివరకు ఘనా ఫలితం రాబట్టింది. జోర్డాన్‌ ఆయూ ఎడమ వైపు నుంచి కొట్టిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో కెప్టెన్‌ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకోగా, ఆ వెంటనే  సలిసు గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాల్లోనే ఘనా ఆధిక్యం పెంచుకుంది. ఈసారి కూడా జోర్డాన్‌ ఆయూనే పాస్‌ అందించగా... కుడూస్‌ హెడర్‌తో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపడంతో విస్తుపోవడం కొరియా వంతైంది. తొలి అర్ధభాగంలో ఘనా ఆట చూస్తే కొరియా చిత్తుగా ఓడుతుందనిపించింది. అయితే విరామం తర్వాత కొరియా కోలుకుంది.

168 సెకన్ల వ్యవధిలో చో గూసంగ్‌ చేసిన రెండు హెడర్‌ గోల్స్‌ ఒక్కసారిగా మ్యాచ్‌ పరిస్థితిని మార్చేశాయి. లీ కాంగ్‌ ఇచ్చిన క్రాస్‌తో తొలి గోల్‌ చేసిన గూసంగ్, రెండో గోల్‌తో అద్భుతాన్ని ప్రదర్శించాడు. కిమ్‌ జిన్‌ కిక్‌ కొట్టగా, గోల్‌ పోస్ట్‌ ముందు గిడియాన్‌ మెన్సాను తప్పించి గాల్లోకి ఎగురుతూ గోల్‌ సాధించడం హైలైట్‌గా నిలిచింది. స్కోరు సమం కావడంతో మళ్లీ హోరాహోరీ మొదలైంది. అయితే కొరియా డిఫెన్స్‌ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ కుడూస్‌ మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివర్లో ఘనా గోల్‌కీపర్‌ లారెన్స్‌ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడం విశేషం. మ్యాచ్‌ తర్వాత పెనాల్టీ విషయంలో రిఫరీ ఆంథోనీ టేలర్‌తో వాదనకు దిగిన కొరియా కోచ్‌ బెంటో రెడ్‌కార్డుకు గురయ్యాడు.   

ప్రపంచకప్‌లో నేడు
ఈక్వెడార్‌ X సెనెగల్‌ రాత్రి గం. 8:30 నుంచి   
నెదర్లాండ్స్‌ X ఖతర్‌ రాత్రి గం. 8:30 నుంచి   
ఇరాన్‌ X అమెరికా అర్ధరాత్రి గం. 12:30 నుంచి  
ఇంగ్లండ్‌ X వేల్స్‌ అర్ధరాత్రి గం. 12:30 నుంచి  

స్పోర్ట్స్‌ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు