FIFA World Cup Qatar 2022: జర్మనీకి జపాన్‌ షాక్‌

24 Nov, 2022 05:50 IST|Sakshi

2–1తో ఆసియా జట్టు గెలుపు  

FIFA World Cup 2022 Germany Vs Japan Highlightsఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో అనూహ్య ఫలితం వచ్చింది. మంగళవారం రెండుసార్లు విశ్వవిజేత అర్జెంటీనాను సౌదీ అరేబియా బోల్తా కొట్టిస్తే... బుధవారం ఏకంగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టును జపాన్‌ ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఆసియా గడ్డపై రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఆసియా జట్లు అద్భుతం చేశాయి.   

దోహా: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మేటి జట్లు, మాజీ చాంపియన్లకు ఆసియా జట్లు ఎవరూ ఊహించని విధంగా షాక్‌ ఇస్తున్నాయి. బుధవారం గ్రూప్‌ ‘ఇ’లో భాగంగా నాలుగుసార్లు చాంపియన్‌ జర్మనీని జపాన్‌ కంగుతినిపించింది. ఇద్దరు సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లు రిత్సు డాన్, టకుమా అసానో చివరి 15 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌తో జపాన్‌ 2–1 స్కోరుతో జర్మనీని గట్టిదెబ్బే తీసింది.

తరచూ జర్మన్‌ క్లబ్‌లలో ఆడే రిత్సు (75వ ని.), అసానో (83వ ని.) ఈ ప్రపంచకప్‌లో ఆ జాతీయ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. జర్మనీ తరఫున ఇల్కే గుయెండగన్‌ (33వ ని.) గోల్‌ సాధించాడు. ఈ గ్రూప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ జట్టయిన జర్మనీ ఆరంభం నుంచే గోల్స్‌ ప్రయత్నాలకు పదును పెట్టింది.

ఈ క్రమంలో 24 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్లు ఆడింది. ప్రథమార్ధంలోనే గుయెండగన్‌ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తీవ్రమైన ఒత్తిడిలో రెండో అర్ధభాగాన్ని మొదలుపెట్టిన జపాన్‌కు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లు అసాధారణ ఫలితాలను సాధించి పెట్టారు.

జపాన్‌ 2–1 ఆధిక్యంతో గెలుపు దారిలో పడగా... జర్మనీ మాత్రం ఎక్కడా పట్టు సడలించలేదు. ఆఖరి నిమిషం దాకా కష్టపడింది. నిర్ణీత సమయంలోని 90వ నిమిషం నుంచి ఇంజ్యూరీ టైమ్‌ 9 నిమిషాల పాటు స్కోరు సమం చేసేందుకు కడదాకా చెమటోడ్చింది. ఫుల్క్‌రగ్, రుడిగెర్, గోరెట్జా, సులే అదేపనిగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్లు ఆడారు.

అయితే జపాన్‌ డిఫెండర్లు, గోల్‌ కీపర్‌ సమన్వయంతో ఆడ్డుకోవడంతో జర్మనీ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. జపాన్‌ గోల్‌ కీపర్‌ షుయిచి గొండా పెట్టని కోటలా నిలుచున్నాడు. ప్రపంచకప్‌ చరిత్ర లో ఆసియా జట్టు చేతిలో ఓడిపోవడం జర్మనీకిది రెండోసారి. 2018 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా చేతిలో జర్మనీ 0–2తో ఓడిపోయింది.

చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! స్టార్‌ ఆటగాడు దూరం
Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో!

మరిన్ని వార్తలు