FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది

28 Nov, 2022 04:56 IST|Sakshi

మెక్సికోపై 2–0తో విజయం

గోల్‌ కొట్టిన కెప్టెన్‌ మెస్సీ  

తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ లో నాకౌట్‌ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్‌ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్‌ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్‌ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్‌ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్‌ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పడుతుంది.   

దోహా: టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్‌ లయనెల్‌ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్‌ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్‌ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది.

మరోవైపు మెక్సికో ఫార్వర్డ్‌ అలెక్సిక్‌ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్‌ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్‌ డైవ్‌ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్‌ అందుకొని షాట్‌ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్‌ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది.

ప్రపంచకప్‌లో నేడు
కామెరూన్‌ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి   
దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి   
బ్రెజిల్‌ X స్విట్జర్లాండ్‌ రాత్రి గం. 9:30 నుంచి
పోర్చుగల్‌ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 

మరిన్ని వార్తలు