Fifa World Cup Qatar 2022: ఎడారి దేశంలో.. సాకర్‌ తుఫాన్‌

20 Nov, 2022 05:30 IST|Sakshi

నేటి నుంచి ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌

తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్‌ ‘ఢీ’

రొనాల్డో... మెస్సీ... నెమార్‌... హ్యారీ కేన్‌... ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ఇవేమీ కొత్త పేర్లు కాదు... కానీ ఇప్పుడు మళ్లీ అవన్నీ మన ముంగిట కొత్తగా వినిపిస్తాయి. సాధారణంగా ఎప్పుడు పిలవని, నోరు తిరగని నామ      ధేయాలు కూడా ఇప్పుడు మన నోటిపై జపం చేస్తాయి. క్రీడాభిమానుల కళ్లన్నీ నెల రోజుల పాటు మిగతా ఆటలన్నీ గట్టున పెట్టేసి ఈ మ్యాచ్‌ల ఫలితం కోసం ఎదురు చూస్తాయి.

ఇప్పుడు లెక్క సెంచరీల్లోనో, పరుగుల సంఖ్యలోనో కాదు... సింగిల్‌ డిజిట్‌లోనే సీన్లు మారిపోతాయి... అంతా గోల్స్‌ గోలనే ... ఒక్క అంకె ఒకవైపు ఆనందం నింపితే, మరోవైపు గుండెలు బద్దలు చేస్తుంది. 32 దేశాల మెరుపు వీరులు మైదానంలో పాదరసంలా దూసుకుపోతుంటే... ఉత్సాహం, ఉద్వేగానికి లోటు ఏముంటుంది... 64 మ్యాచ్‌లలో మన కళ్లన్నీ బంతి మీదే నిలిస్తే ఆఖరి రోజున జగజ్జేతగా మనమే నిలిచిన భావన అభిమానిది... అవును, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరించేందుకు ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ మళ్లీ వచ్చేసింది. 29 రోజుల పాటు కళ్లార్పకుండా చూసేందుకు, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు మీరంతా సిద్ధమైపోండి!   
 
మరి కొన్ని గంటల్లో... ప్రపంచం మొత్తం అబ్బురపడే అత్యద్భుత ఘట్టానికి తెర లేవనుంది... ఎడారి దేశం ఖతర్‌లో ఇసుక తుఫాన్‌లు సాధారణం. అయితే రాబోయే నెలరోజులు సాకర్‌ సంగ్రామం ఎడారి దేశాన్ని ఒక ఊపు ఊపనుంది. సుమారు 16 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధమైన మెగా క్రీడా సంబరానికి విజిల్‌ మోగనుంది. ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి... కానీ 22వది మాత్రం అన్నింటికంటే భిన్నం!   అమెరికా, యూరోప్‌ దేశాలను దాటి అరబ్‌ దేశంలో తొలిసారి నిర్వహిస్తున్న టోర్నీ కాగా... ఆతిథ్య దేశం
ఆలోచనలకు అనుగుణంగా వచ్చిన నియమ నిబంధనలు ఈ మెగా టోర్నీని మరింత ప్రత్యేకంగా మార్చాయి... ఆతిథ్య హక్కులు కేటాయించిన నాటి నుంచి ఇప్పటి వరకు పలు వివాదాలు వెంట వచ్చినా, ఖర్చు అంచనాలను దాటి ఆకాశానికి చేరినా వెనక్కి తగ్గని ఖతర్‌ దేశం టోర్నమెంట్‌ను మెగా సక్సెస్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే పండగ ముందు ఏర్పాట్లలో ఎంత కష్టం ఉన్నా... ఒక్కసారి ఆట మొదలైతే అన్నీ వెనక్కి వెళ్లిపోతాయి.‘ఫిఫా’ కూడా సరిగ్గా ఇదే  ఆశిస్తోంది.   
                                           

ఖతర్‌ దేశపు రాజధాని దోహా వేదికగా 22వ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్‌ తలపడుతుంది. ఖతర్‌ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్‌ 18న ఫైనల్‌ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్‌–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్‌ జరగడం ఇది రెండోసారి కాగా... ఒక మధ్యప్రాచ్య దేశం విశ్వ సంరంభానికి వేదిక కావడం ఇదే మొదటిసారి. 32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్‌ కప్‌ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్‌ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయి.

నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రతీ ప్రపంచకప్‌ సాధారణంగా జూన్‌–జూలైలో నిర్వహిస్తారు. అయితే ఆ సమయంలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ఎడారి దేశంలో నిర్వహణ సాధ్యం కాదని ‘ఫిఫా’ మరో ప్రత్యామ్నాయాన్ని సూచించింది. పలు చర్చోపర్చలు, ఒప్పందాల్లో సవరణలు, వివిధ దేశాల్లో జరిగే ఫుట్‌బాల్‌ లీగ్‌ల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ చివరకు దానిని నవంబర్‌–డిసెంబర్‌కు మార్చారు. అయితే ఈ సమయంలో కూడా వేదికలను సాధ్యమైనంత చల్లగా ఉంచేందుకు నిర్వాహక కమిటీ పలు కొత్త సాంకేతికలను ఉపయోగించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

► మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. వరల్డ్‌ కప్‌ ట్రోఫీని, 8 వేదికలను గుర్తు చేయడంతో పాటు ఎప్పటికీ శాశ్వతం అన్నట్లుగా గణిత సంజ్ఞ ‘ఇన్‌ఫినిటీ’ని కలుపుతూ టోర్నీ లోగోను నిర్వాహకులు తయారు చేశారు.

మహిళా రిఫరీలు...
పురుషుల ప్రపంచకప్‌లో మహిళా రిఫరీలను నియమించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. స్టెఫానీ ఫ్రాపర్ట్‌ (ఫ్రాన్స్‌), సలీమా ముకసంగా (రువాండా), యోషిమి యమషిత (జపాన్‌) ఆ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురు మహిళలకు అసిస్టెంట్‌ రిఫరీలుగా కూడా తొలిసారి అవకాశం దక్కింది.

‘ఖతర్‌’నాక్‌ నిబంధనలు!  
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాలతో పోటీ పడి 2010లో ఖతర్‌ నిర్వాహక హక్కులు దక్కించుకుంది. వైశాల్యంపరంగా చూస్తే ప్రపంచకప్‌ నిర్వహణ హక్కులు దక్కించుకున్న అతి చిన్న దేశం ఇది. గతంలో ఒక్కసారి కూడా వరల్డ్‌ కప్‌లో పాల్గొనకుండా నిర్వహణ హక్కులు తీసుకున్న రెండో దేశం ఖతర్‌ (జపాన్‌ 2002లో కోసం 1996లోనే హక్కులు కేటాయించారు. అయితే నిర్వహణకు ముందు ఆ జట్టు 1998 టోర్నీకి క్వాలిఫై అయింది). ఈ క్రమంలో పెద్ద ఎత్తున వివాదాలు కూడా వెంట వచ్చాయి. తగినన్ని అర్హత ప్రమాణాలు లేకపోయినా... ‘ఫిఫా’ అధికారులు విపరీతమైన అవినీతికి పాల్పడి హక్కులు కేటాయించినట్లుగా విమర్శలు వచ్చాయి.

విచారణలో అది వాస్తవమని కూడా తేలి చాలా మంది నిషేధానికి కూడా గురయ్యారు కానీ అప్పటికే ఏర్పాట్లు జోరుగా ఉండటంతో వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. స్టేడియాల నిర్మాణంలో 6 వేలకు పైగా కార్మికులు మరణించారని, మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగిందని కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. అయితే ఎన్ని జరిగినా... చివరకు ఆట మాత్రం ముందుకు వెళ్లింది. అయితే ఇప్పుడు సరిగ్గా మెగా ఈవెంట్‌ సమయంలో ఆ దేశపు నిబంధనలు అటు ‘ఫిఫా’ అధికారులను, ఇటు ప్రపంచవ్యాప్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ న్యాయవ్యవస్థ మొత్తం ‘షరియా’ ఆధారంగా ఉండటంతో అందరికీ ఇది కొత్తగా అనిపిస్తోంది. కానీ నిబంధనలు మాత్రం కఠినంగా ఉండటంతో పాటు ఉల్లంఘిస్తే శిక్షలు కూడా కఠినమే. భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా ఇందులో ఉన్నాయి.   

► ముందుగా ‘హయ్యా’ కార్డును తీసుకోవాలి. ఆ దశపు ‘వీసా’, మ్యాచ్‌ టికెట్‌ ఉన్నా సరే... హయ్యా కార్డు ఉంటేనే ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతిస్తారు. రవాణా సౌకర్యం వాడుకునేందుకు కూడా ఇది అవసరం.  
► స్టేడియం పరిసరాల్లో ఆల్కహాల్‌ నిషేధం.. బీర్లకు కూడా అనుమతి లేదు. దీని వల్ల సుదీర్ఘకాలంగా తమకు స్పాన్సర్‌గా ఉన్న ప్రఖ్యాత కంపెనీ ‘బడ్‌వైజర్‌’తో ‘ఫిఫా’కు ఒప్పంద ఉల్లంఘన సమస్య వచ్చింది. దీనిని సరిదిద్దేందుకు వారికి తలప్రాణం తోకకు వచ్చింది. చివరగా స్టేడియాలకు కొద్ది దూరంలో ‘ఫ్యాన్‌ ఫెస్టివల్‌’ జోన్‌లు ఏర్పాటు చేసి అక్కడ తాగేందుకు అనుమతినిచ్చారు. అయితే ఎవరైనా తాగి గ్రౌండ్‌లోకి వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మాత్రం దేశం నుంచి బయటకు పంపించేస్తారు.  
► ఇష్టమున్నట్లుగా దుస్తులు ధరిస్తే కుదరదు. భుజాలు, మోకాళ్లు కనిపించేలా మహిళల దుస్తులు ఉండరాదు. పబ్లిక్‌ బీచ్‌లలో స్విమ్‌సూట్‌లు ధరించరాదు. అది హోటల్‌ స్విమ్మింగ్‌పూల్‌లకే పరిమితం. మైదానంలో ఉత్సాహంతో షర్ట్‌లు తొలగించడం కూడా కుదరదు. స్పెషల్‌ జూమ్‌ కెమెరాలతో వాటిని గుర్తించి చర్యలు తీసుకుంటారు.
► భార్యాభర్తలైనా సరే, బహిరంగ ప్రదేశాల్లో  రూపంలో కూడా తమ ప్రేమను ప్రదర్శించరాదు. హోమో సెక్సువల్స్‌కైతే అసలే కలిసి ఉండేందుకు అనుమతి లేదు.   

విజేత జట్టుకు రూ. 341 కోట్లు
ప్రపంచకప్‌ మొత్తం ప్రైజ్‌మనీ 440 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 3,500 కోట్లు) కాగా... విజేతలకు 42 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 341 కోట్లు), రన్నరప్‌కు 30 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 244 కోట్లు) లభిస్తాయి.  

► వరల్డ్‌ కప్‌లో జట్లు ఒక్కో మ్యాచ్‌ నుంచి మరో మ్యాచ్‌ కోసం విమానాల్లో ప్రయాణించే అవసరం లేకుండా వెళ్లేలా వేదికలు ఉండటం 1930 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఎనిమిది స్టేడియాలు, ప్రాక్టీస్‌ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ప్రతీ జట్టు తమకు ప్రాక్టీస్‌ కోసం కేటాయించిన ఒకే బేస్‌ క్యాంప్‌లోనే టోర్నీ మొత్తం సాధన చేస్తుంది.  

–సాక్షి క్రీడా విభాగం    

మరిన్ని వార్తలు