FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...

30 Nov, 2022 04:17 IST|Sakshi
రెండో గోల్‌ చేశాక కెప్టెన్‌ కులిబాలి సంబరం

ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశకు అర్హత సాధించిన సెనెగల్‌

చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై 2–1తో విజయం

కీలక గోల్‌తో గెలిపించిన కెప్టెన్‌ కులిబాలి

దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్‌ జట్టు ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో రెండోసారి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో సెనెగల్‌ 2–1 గోల్స్‌ తేడాతో ఈక్వెడార్‌ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్‌ తరఫున ఇస్మాయిల్‌ సార్‌ (44వ ని.లో), కెప్టెన్‌ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్‌ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు.

మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్‌ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన సెనెగల్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్‌ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్‌ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు.

‘డ్రా’ చేసుకున్నా నాకౌట్‌ దశకు చేరే చాన్స్‌ ఉండటంతో ఈక్వెడార్‌ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్‌ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్‌ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్‌ ప్లేయర్‌ ఇస్మాయిల్‌ సార్‌ను ఈక్వెడార్‌ డిఫెండర్‌ హిన్‌కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్‌ సార్‌ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్‌ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్‌ హెడర్‌ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్‌ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్‌ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్‌ ప్లేయర్‌ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్‌ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్‌ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది.

నెదర్లాండ్స్‌ 11వసారి...
మరోవైపు ఆతిథ్య ఖతర్‌ జట్టుతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్‌ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్‌ (49వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్‌ కావడం విశేషం.

మరిన్ని వార్తలు