FIFA World Cup Qatar 2022: స్పెయిన్‌ ‘సెవెన్‌’ స్టార్‌ ప్రదర్శన

24 Nov, 2022 06:06 IST|Sakshi

కోస్టారికాపై 7–0తో ఘనవిజయం సాధించిన మాజీ చాంపియన్‌

దోహా: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒక జట్టయిన స్పెయిన్‌ భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్‌ ‘ఇ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2010 విశ్వవిజేత స్పెయిన్‌ 7–0 గోల్స్‌ తేడాతో కోస్టారికా జట్టును చిత్తుగా ఓడించింది. స్పెయిన్‌ తరఫున ఫెరాన్‌ టోరెస్‌ (31వ, 54వ ని.లో) రెండు గోల్స్‌ సాధించగా... డానీ ఓల్మో (11వ ని.లో), మార్కో అసెన్‌సియో (21వ ని.లో), గావి (74వ ని.లో), కార్లోస్‌ సోలెర్‌ (90వ ని.లో), అల్వారో మొరాటా (90+2వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. తమ ప్రపంచకప్‌ చరిత్రలో స్పెయిన్‌కిదే అతిపెద్ద విజయం. ఆ జట్టు ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఏడు గోల్స్‌ చేయడం ఇదే తొలిసారి.

కోస్టారికాతో మ్యాచ్‌లో స్పెయిన్‌ సంపూర్ ఆధిపత్యం చలాయించింది. 82 శాతం బంతి స్పెయిన్‌ ఆధీనంలో ఉండటం వారి ఆధిపత్యానికి నిదర్శనం. స్పెయిన్‌ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా ఎనిమిది షాట్‌లు కొట్టగా... కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్‌ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్‌ కొట్టలేకపోయింది. స్పెయిన్‌ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్‌లు పూర్తి చేశారు. ప్రపంచకప్‌ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పాస్‌లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు 231 పాస్‌లతో సరిపెట్టుకున్నారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో స్పెయిన్‌ మూడు గోల్స్‌ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్‌పై తొలి అర్ధభాగంలో స్పెయిన్‌ మూడు గోల్స్‌ సాధించింది.   

క్రొయేషియా 0  మొరాకో 0
గత ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీ రన్నరప్‌ క్రొయేషియాను మొరాకో నిలువరించింది. బుధవారం గ్రూప్‌ ‘ఎఫ్‌’లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ 0–0తో డ్రాగా ముగిసింది. సీనియర్‌ స్ట్రయికర్, క్రొయేషియా   కెప్టెన్‌ మోడ్రిచ్‌ ఖాతా తెరిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసిన మొరాకో ఆటగాళ్లు అడ్డుగోడ కట్టేయంతో గోల్‌ నమోదు కాలేదు.

>
మరిన్ని వార్తలు