తడబడితే తారుమారు

10 Nov, 2022 05:55 IST|Sakshi

ఆద్యంతం నిలకడగా రాణిస్తేనే ప్రపంచకప్‌ బెర్త్‌

తేలిగ్గా తీసుకుంటే తప్పదు చుక్కెదురు

మెగా ఈవెంట్‌కు అర్హత పొందలేకపోయిన మేటి జట్లు

విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్‌. ఇతర టీమ్‌ క్రీడల్లో మాదిరిగా ఈ ఆటలో రెండు దేశాల మధ్య ఏడాదికో రెండేళ్లకో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు. ఏడాదిలో ఎక్కువ భాగం స్టార్‌ ఆటగాళ్లందరూ ఆయా దేశాల్లో ప్రొఫెషనల్‌ లీగ్‌లలో క్లబ్‌ జట్లకు ఆడుతుంటారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ లేదా యూరో టోర్నీ లేదా కోపా అమెరికా కప్‌ లేదా కాన్ఫడరేషన్స్‌ కప్‌లాంటి టోర్నీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో అప్పుడప్పుడు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. దాదాపు మూడేళ్లపాటు కొనసాగే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలలో ఎంతటి గొప్ప జట్టయినా ఆద్యంతం నిలకడగా రాణిస్తేనే ముందంజ వేస్తాం. కేవలం ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చిన్న చిన్న జట్లు కూడా వదులుకోవు. అందుకే ప్రత్యర్థి జట్టుకి ఎంత గొప్ప రికార్డు ఉన్నా ఈ చిన్న జట్లు కడదాకా సంచలనం కోసం పోరాడతాయి.

ఈ క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద జట్లకు చుక్కెదురు తప్పదు. మరో పది రోజుల్లో ఖతర్‌ వేదికగా జరగనున్న 22వ ప్రపంచకప్‌లో కచ్చితంగా అర్హత సాధిస్తాయనుకున్న ఎనిమిది జట్లు (ఇటలీ, స్వీడన్, రష్యా, చిలీ, ఈజిప్ట్, నైజీరియా, కొలంబియా, అల్జీరియా) క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచాయి. ఈ జాబితాలో అతి ముఖ్యమైన జట్టు ఇటలీ. ప్రపంచకప్‌లో ఇటలీ జట్టుకు గొప్ప చరిత్రనే ఉంది. నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత పొందలేకపోయింది.

2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు బెర్త్‌ దక్కించుకోలేకపోయిన ఇటలీ జట్టు ఈసారి ఖతర్‌ విమానం కూడా ఎక్కడంలేదు. యూరోప్‌ దేశాలకు మొత్తం 13 బెర్త్‌లు ఉండగా... గ్రూప్‌ దశలో పది గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 10 జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. గ్రూప్‌ ‘సి’లో ఇటలీ జట్టు రెండో స్థానంలో నిలిచి నేరుగా కాకుండా రెండో రౌండ్‌ ద్వారా అర్హత పొందేందుకు రేసులో నిలిచింది. అయితే రెండో రౌండ్‌లో ఇటలీ 0–1తో నార్త్‌ మెసడోనియా చేతిలో ఓడిపోయి ప్రపంచకప్‌నకు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది.  

2018 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన స్వీడన్‌ ఈసారి క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా జట్టుపై వేటు వేశారు. దక్షిణ అమెరికా జోన్‌లో ఆరో స్థానంలో నిలిచి కొలంబియా ఈ మెగా టోర్నీకి దూరమైంది. 1962లో ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడంతోపాటు మూడో స్థానంలో నిలిచిన చిలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ బెర్త్‌ సాధించలేకపోయింది. ఆఫ్రికా జోన్‌ నుంచి చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఓడి ఈజిప్ట్, నైజీరియా, అల్జీరియా మెగా టోర్నీకి అర్హత పొందలేకపోయాయి. 1938 నుంచి 2002 ప్రపంచకప్‌ వరకు ఆతిథ్య దేశంతోపాటు డిఫెండింగ్‌ చాంపియన్‌కు నేరుగా ఎంట్రీ లభించేది. కానీ 2006 ప్రపంచకప్‌ నుంచి కేవలం ఆతిథ్య జట్టుకే నేరుగా ఎంట్రీ ఇచ్చి డిఫెండింగ్‌ చాంపియన్‌ కూడా క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా బెర్త్‌ సాధించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. –సాక్షి క్రీడావిభాగం

మరిన్ని వార్తలు