FIFA World Cup 2022: డెన్మార్క్‌కు చెక్‌ పెట్టిన ట్యునీషియా..  మెక్సికో- పోలాండ్‌ మ్యాచ్‌ కూడా

23 Nov, 2022 10:03 IST|Sakshi
పోలాండ్‌- మెక్సికో మ్యాచ్‌ డ్రా

డెన్మార్క్‌ను 0–0తో నిలువరించిన ట్యునీషియా 

పోలాండ్‌- మెక్సికో మ్యాచ్‌ డ్రా 

FIFA World Cup 2022- దోహా: పట్టుదలతో ఆడితే ప్రపంచకప్‌లాంటి గొప్ప ఈవెంట్‌లోనూ తమకంటే ఎంతో మెరుగైన జట్టుపై మంచి ఫలితం సాధించవచ్చని ట్యునీషియా జట్టు నిరూపించింది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్‌ ట్యునీషియా 0–0తో ప్రపంచ 10వ ర్యాంకర్‌ డెన్మార్క్‌జట్టును నిలువరించింది.

రెండు జట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. ట్యునీషియా గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా డెన్మార్క్‌ జట్టు ఐదుసార్లు షాట్‌లు కొట్టినా ఫలితం లేకపోయింది. డెన్మార్క్‌ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 62 శాతం ఉంచుకున్నా ట్యునీషియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్‌ చేయలేకపోయారు. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ లభించింది.   

మరో ‘డ్రా’
దోహా: ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మరో ‘డ్రా’ నమోదైంది. పోలాండ్, మెక్సికో జట్ల మధ్య మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో రెండు జట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో మ్యాచ్‌ 0–0తో ‘డ్రా’గా ముగిసింది.

మెక్సికో జట్టు పోలాండ్‌ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా నాలుగు సార్లు షాట్‌లు సంధించగా ఒక్కటీ లక్ష్యానికి చేరలేదు. పోలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ లెవన్‌డౌస్కీను మెక్సికో జట్టు వ్యూహత్మకంగా కట్టడి చేసింది. మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ లభించింది.    

వేల్స్‌ను గట్టెక్కించిన బేల్‌ 
64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అర్హత సాధించిన వేల్స్‌ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అమెరికాతో సోమవారం అర్ధరాత్రి దాటాక
జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌ను వేల్స్‌ 1–1తో ‘డ్రా’గా ముగించింది.

ఆట 82వ నిమిషంలో వేల్స్‌ జట్టుకు లభించిన పెనాల్టీని గ్యారెత్‌ బేల్‌ గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 36వ నిమిషంలో టిమోతి  చేసిన గోల్‌తో అమెరికా ఖాతా తెరిచింది. మ్యాచ్‌ ‘డ్రా’ కావడంతో రెండు జట్లుకు ఒక్కో పాయింట్‌ దక్కింది.  

చదవండి: FIFA World Cup: ప్రపంచకప్‌లో సంచలనాల జాబితా.. ఇప్పుడు సౌదీ.. అప్పట్లో

మరిన్ని వార్తలు