-

Lionel Messi: బార్సిలోనాతోనే ఇంకో ఐదేళ్లు.. మెస్సీ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా?

15 Jul, 2021 07:36 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాలర్‌గా పేరున్న లియోనెల్‌ మెస్సీ.. రాజీకి సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్ట్‌ ఇటీవలె ముగిసిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యం ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. అయితే ఊహాగానాలకు తెరదించుతూ మెస్సీ మరోసారి బార్సిలోనా కాంట్రాక్ట్‌కే మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది. 

మరో ఐదేళ్లపాటు బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం చేసుకోబోతున్న మెస్సీ.. 50 శాతం జీతం కట్టింగ్‌కు సైతం సిద్ధపడినట్లు గోల్‌.కామ్‌ బుధవారం ఒక కథనం ప్రచురించింది. రీ-సైన్‌ నేపథ్యంలో వార్షికాదాయంలో ఈ కట్టింగ్‌లు పోతాయని, దీనిపై క్లబ్‌ త్వరలోనే అధికార ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బార్సిలోనా క్లబ్‌ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్‌లు ఇవ్వలేకపోతోంది కూడా. ఈ నేపథ్యంలో క్లబ్‌కు ఊరట ఇచ్చేలా మెస్సీ తన జీతంలో త్యాగానికి సిద్ధపడినట్లు కథనాలు వెలువడ్డాయి. 

ఈ విషయంలో మెస్సీ మాస్టర్‌ ప్లాన్‌ అమలుచేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా కంటే ఎక్కువ జీతం ఆఫర్‌ చేస్తున్నాయి కొన్ని క్లబ్‌లు. అయితే పలు బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్న మెస్సీ.. వాటి ద్వారా గణనీయమైన ఆదాయం వెనకేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెస్సీ వేరే క్లబ్‌లకు వెళ్తే గనుక.. విశ్వసనీయత దెబ్బతిని ఆ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నాడు. అందుకే బార్సిలోనా ఆఫర్‌కు తలొగ్గడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్‌ మాంత్రికుడు 2004 నుంచి బార్సిలోనాతో కొనసాగుతున్నాడు.

గత ఐదేళ్ల కాంట్రాక్ట్‌ కోసం 550 మిలియన్ల యూరోస్‌తో మెస్సీ ఒప్పందం చేసుకుని.. ప్రపంచంలోనే కాస్ట్‌లీ ప్లేయర్‌గా రికార్డ్‌ సృష్టించాడు. తాజాగా కాంట్రాక్ట్‌ ముగిశాక ‘పారిస్‌ సెయింట్‌ జెర్మాయిన్‌, మాంచెస్టర్‌ సిటీ, ఇంటర్‌ మిలన్‌లు మెస్సీకు బంపరాఫర్లు ప్రకటించాయి కూడా. ప్రస్తుత కథనాలు నిజమైతే 2026 వరకు మెస్సీ బార్సిలోనాతోనే కొనసాగుతాడు.

మరిన్ని వార్తలు