FIH Pro League: ‘షూటౌట్‌’లో భారత్‌ గెలుపు

16 Mar, 2023 05:58 IST|Sakshi

 ఆస్ట్రేలియాకు మరో ఓటమి  

రూర్కెలా: సొంతగడ్డపై ప్రొ హాకీ లీగ్‌ దశను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్‌’లో 4–3 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. అంతకుముందు నిర్ణీత సమయం పూర్తయ్యాక రెండు జట్లు 2–2తో సమఉజ్జీగా నిలిచాయి. రెగ్యులర్‌ టైమ్‌లో భారత్‌ తరఫున వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (2వ ని.లో), సుఖ్‌జీత్‌ సింగ్‌ (47వ ని.లో)... ఆస్ట్రేలియా తరఫున నాథన్‌ ఎఫార్మస్‌ (37వ ని.లో), టిమ్‌ హోవర్డ్‌ (52వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

‘షూటౌట్‌’లో తొలి ఐదు షాట్‌లలో భారత్‌ నుంచి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, సుఖ్‌జీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌ సఫలమవ్వగా... హార్దిక్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున జేక్‌ హార్వీ, క్రెయిగ్‌ మరైస్, జాక్‌ వెల్చ్‌ గోల్స్‌ చేయగా... జేక్‌ వెటన్, నాథన్‌ ఎఫార్మస్‌ గురి తప్పారు. దాంతో ‘షూటౌట్‌’లో రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్‌డెత్‌’లో తొలి షాట్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలచగా... ఆస్ట్రేలియా ప్లేయర్‌ జాక్‌ వెల్చ్‌ షాట్‌ను భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ నిలువరించడంతో టీమిండియా విజయం ఖాయమైంది.  
 

మరిన్ని వార్తలు