భారత్‌ ‘షూటౌట్‌’ విజయం

4 Jun, 2023 06:00 IST|Sakshi

లండన్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4–2 (షూటౌట్‌)లో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 4–4 గోల్స్‌తో సమంగా నిలవగా...ఆ తర్వాత భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (6వ నిమిషం), మన్‌దీప్‌ సింగ్‌ (18వ, సుఖ్‌జీత్‌ సింగ్‌ (27వ), అభిషేక్‌ (49వ) ఒక్కో గోల్‌ సాధించగా, ఇంగ్లండ్‌ తరఫున వార్డ్‌ స్యామ్‌ ఒక్కడే 4 గోల్స్‌ (7వ, 39వ, 46వ, 52వ నిమిషాల్లో) చేయడం విశేషం. అనంతరం షూటౌట్‌లో భారత్‌నుంచి మన్‌ప్రీత్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్, అభిషేక్‌ సఫలం కాగా, ఇంగ్లండ్‌నుంచి కాల్నాన్‌ విల్, వాలన్‌ జాచరీ మాత్రమే గోల్‌ చేయగలిగారు.

సొంతగడ్డపై ఆరంభంలో ఇంగ్లండ్‌ వరుసగా దాడులు చేయగా, భారత గోల్‌ కీపర్‌ కృష్ణన్‌ పాఠక్‌ వాటిని సమర్థంగా అడ్డుకోగా, భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలచగలిగాడు. 25 సెకన్ల లోపే వార్డ్‌ గోల్‌తో ఇంగ్లండ్‌ స్కోరు సమం చేయగా...మన్‌దీప్, సుఖ్‌జీత్‌లో ఫీల్డ్‌ గోల్స్‌తో తొలి అర్ధ భాగం ముగిసే సరికి భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో, ఆపై నాలుగో క్వార్టర్‌ ఆరంభంలో కూడా ఒక్కో గోల్‌ సాధించి వార్డ్‌ ‘హ్యాట్రిక్‌’ పూర్తి చేయడంతో స్కోరు 3–3తో సమమైంది. ఐదు నిమిషాల తర్వాత మరో గోల్‌తో భారత్‌ ముందంజలో నిలిచినా, వార్డ్‌ తన నాలుగో గోల్‌తో మళ్లీ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అయితే షూటౌట్‌లో చివరకు భారత్‌దే పైచేయి అయింది.  

మరిన్ని వార్తలు