FIH Pro League: రాణి రాకతో బలం పెరిగింది.. కానీ

8 Apr, 2022 08:07 IST|Sakshi

భువనేశ్వర్‌: మహిళల ప్రొ లీగ్‌ హాకీలో భాగంగా శుక్రవారం కీలక పోరుకు భారత్‌ సన్నద్ధమైంది. ఒలింపిక్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడనుంది. నాడు ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1–5తో డచ్‌ బృందం చేతిలో ఓడింది. అయితే అప్పటినుంచి మన జట్టు ప్రదర్శన ఎంతో మెరుగైంది. మరో వైపు ఈ లీగ్‌ కోసం నెదర్లాండ్స్‌ తమ అత్యుత్తమ ఆటగాళ్లతో కాకుండా దాదాపు ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దింపుతోంది.

పైగా సొంతగడ్డపై ఆడుతుండటంతో భారత బృందం గెలుపుపై ఆశలున్నాయి. ప్రస్తుతం లీగ్‌ పట్టికలో నెదర్లాండ్స్‌ 17 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌ 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సీనియర్‌ ప్లేయర్‌ రాణి రాంపాల్‌ పునరాగమనం జట్టు బలాన్ని పెంచింది. కానీ.. మరో ముగ్గురు కీలక సభ్యులు సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్‌రెమ్‌సియామి జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో ఆడుతుండటంతో ఈ పోరుకు దూరమయ్యారు. ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా గత పోరులో జర్మనీతో తలపడిన భారత్‌ తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో గెలిచింది.  

చదవండి: LSG Vs DC: డికాక్‌ మెరుపు బ్యాటింగ్‌.. లక్నో హ్యాట్రిక్‌! పాపం పృథ్వీ షా! 

మరిన్ని వార్తలు