బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకున్న స్టోక్స్..

30 Jun, 2021 17:22 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఘోర పరాభవానికి.. ఐదేళ్ల తర్వాత లెక్క అప్పజెప్పాడు. వివరాల్లోకి వెళితే.. భారత్‌ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ తుది పోరులో ఇంగ్లండ్‌, వెస్టిండీస్​ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జో రూట్‌(54), జోస్ బట్లర్‌(36), డేవిడ్‌ విల్లీ(21) పర్వాలేదనిపించాడు. విండీస్‌ బౌలర్లలో బ్రావో, బ్రాత్‌వైట్‌ తలో మూడు వికెట్లు తీశారు.

అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లీష్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 19వ ఓవర్‌లో శాముల్స్‌, బ్రాత్‌వైట్‌లు తడబడ్డారు. దీంతో చివరి ఓవర్‌లో విండీస్‌ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్టోక్స్‌ వేసిన చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన బ్రాత్‌వైట్‌ విండీస్‌కు అపురూప విజయాన్ని అందించాడు. ఈ మెగా ఈవెంట్‌ తర్వాత స్టోక్స్, బ్రాత్‌వైట్‌ ప్రత్యర్థులుగా ఎక్కువగా ఎదురుపడలేదు. అయితే బ్రాత్‌వైట్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం స్టోక్స్‌కు టీ20 బ్లాస్ట్‌ రూపంలో వచ్చింది.

ఈ లీగ్‌లో భాగంగా డర్హమ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్.. వార్విక్‌షైర్‌ ఆటగాడు, విండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా 6,4,0,6 బాదేశాడు. ఐదేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకున్నాడు. బ్రాత్‌వైట్‌లా వరుస సిక్స్‌లు బాదే అవకాశం రానప్పటికీ.. అతనిలానే భారీ షాట్లు ఆడుతూ ఒకే ఓవర్‌లో 16 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులను ఎదుర్కొన్న స్టోక్స్.. 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేయడంతో డర్హమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం వార్విక్‌షైర్‌ 18.3 ఓవర్లలోనే 130 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. కాగా, ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో నిలిచిన స్టోక్స్.. చేతి వేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.

మరిన్ని వార్తలు