మైదానంలో ధోని సేన 

5 Sep, 2020 02:42 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ జట్లలో అందరికంటే చివరగా మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మైదానంలోకి అడుగు పెట్టింది. ఆరు రోజుల తప్పనిసరి ఐసోలేషన్, ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా సోకిన విఘ్నాల తర్వాత ఎట్టకేలకు ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లోకి వచ్చారు. ధోని సారథ్యంలోని సీఎస్‌కే శుక్రవారం తమ సాధన మొదలు పెట్టింది. అయితే కరోనా సోకిన దీపక్‌ చహర్, రుతు రాజ్‌ గైక్వాడ్‌ మాత్రం ఇంకా ప్రాక్టీస్‌ చేయడానికి వీలు లేదు. రెండు వారాల ఐసోలేషన్‌ తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించాకే వీరికి అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు మినహా మిగతా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారని టీమ్‌ సీఈఓ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. వీరందరికీ వరుసగా మూడో సారి నిర్వహించిన పరీక్షలు కూడా నెగెటివ్‌గా వచ్చాయని, అందుకే ఆట మొదలు పెట్టామని ఆయన చెప్పారు. కోచ్‌ ఫ్లెమింగ్, బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌ మైక్‌ హస్సీ పర్యవేక్షణలో ప్రాక్టీస్‌ కొనసాగింది. చెన్నై జట్టు తాజా పరిస్థితిని చూస్తే ఈ నెల 19న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు