అశ్విన్‌ ‘ఫైనల్‌ వార్నింగ్’‌.. పాంటింగ్‌కేనా?

6 Oct, 2020 16:39 IST|Sakshi

దుబాయ్‌: గతేడాది జరిగిన ఐపీఎల్‌లో  రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను ‘మన్కడింగ్‌’ ద్వారా ఔట్‌ చేసి రవిచంద్రన్‌ అశ్విన్‌ వివాదానికి తెరలేపాడు. అప్పుడు అశ్విన్‌ కింగ్స్‌ పంజాబ్‌  కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈ ఏడాది అశ్విన్‌ ఫ్రాంచైజీ మారింది.. మనసు కూడా మారింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌.. మన్కడింగ్‌(నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌ దాటినప్పుడు చేసే రనౌట్‌) అవకాశం వచ్చినా దాన్ని వదిలేశాడు. కేవలం వార్నింగ్‌తో సరిపెట్టి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న అరోన్‌ ఫించ్‌ క్రీజ్‌ను దాటి ఆమడ దూరం వెళ్లాడు. కానీ అశ్విన్‌ మన్కడింగ్‌కు ప్రయత్నించలేదు. బంతిని వేయడం ఆపేసి ఫించ్‌కు మర్యాదగా వార్నింగ్‌ ఇచ్చాడు.(చదవండి: ఫ్రీబాల్‌కు పట్టుబడుతున్న అశ్విన్‌!)

అశ్విన్‌ ఫైనల్‌ వార్నింగ్‌.. ఎవరికి!
ఇప్పడు ఆ ఫైనల్‌ వార్నింగ్‌ కోసం ట్వీటర్‌లో వివరణ ఇచ్చుకున్నాడు. ‘ నేను మన్కడింగ్‌పై క్లియర్‌గా చెబుతున్నా. 2020 సీజన్‌లో ఫస్ట్‌ అండ్‌ ఫైనల్‌ వార్నింగ్‌ ఇది. నేను అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. ఆపై నన్ను ఎవరూ విమర్శించవద్దు’ అని ట్వీట్‌ ద్వారా తెలిపాడు. ఇకపై అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు తనతో  జాగ్రత్తగా ఉండాలని ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చినా,  రికీ పాంటింగ్‌, అరోన్‌ ఫించ్‌లను ట్యాగ్‌ చేస్తూ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి ఇక్కడ ఆ వార్నింగ్‌ పరోక్షంగా పాంటింగ్‌కే ఇచ్చినట్లు కనబడుతోంది. తనకు ఫించ్‌ మంచి స్నేహితుడని పేర్కొన్న అశ్విన్‌.. మరి ఇప్పుడు ఢిల్లీకే ఆడుతూ కోచ్‌ రికీ పాంటింగ్‌కే వార్నింగ్‌ ఇచ్చాడా అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ట్వీట్‌కు కారణం అదేనా?
గతేడాది మన్కడింగ్‌ వివాదంపై ఢిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా స్పందించాడు. ఇది గేమ్‌ ఆఫ్‌ ద స్పిరిట్‌ కాదని చెప్పాడు. దీనికి ఐదు పరుగుల పెనాల్టీ విధించాలని పాంటింగ్‌ వాదించాడు. ఈ నిబంధనను తీసుకురావాలన్నాడు. కాగా ఇప్పుడు అశ్విన్‌ మన్కడింగ్‌ అవకాశాన్ని వదిలేయడానికి పాంటింగ్‌ తమ కోచ్‌గా ఉండటమే ప్రధాన కారణం కావొచ్చు. కానీ అశ్విన్‌లో ఎందుకో మన్కడింగ్‌ చేసే అవకాశాన్ని వదిలేశాననే బాధ ఉన్నట్లు ఉంది. అందుకే ట్వీట్‌ రూపంలో మన ముందుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇకపై మన్కడింగ్‌ చేసే అవకాశాన్ని వదలబోనని హెచ్చరించాడు. ఫించ్‌దే తన వరకూ చివరిది అవుతుందన్నాడు. ఆపై తనను ఎవరూ నిందించవద్దని, మన్కడింగ్‌ చేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోనని తెలిపాడు. దీనిపై ఇక ఎవరు చెప్పినా తాను వినే ప్రసక్తే లేదని అశ్విన్‌ చెప్పకనే చెప్పేశాడు. ఒకవేళ కోచ్‌ పాంటింగ్‌ చెప్పినా తన వైఖరిలో మార్పు ఉండదనేది అశ్విన్‌ అభిప్రాయంగా కనబడుతోంది.(చదవండి: కెమెరాలన్నీ పాంటింగ్‌వైపే!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు