1889 తర్వాత మళ్లీ ఇప్పుడే..

4 Mar, 2021 10:17 IST|Sakshi

దుబాయ్‌: జింబాబ్వే, ఆప్గానిస్తాన్‌ల మధ్య బుధవారం ముగిసిన మొదటి టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 10 వికెట్ల తేడాతో ఆఫ్గన్‌పై విజయం సాధించింది. అంతకముందు టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు కూడా రెండు రోజుల్లో ముగియడం.. అందులోనూ టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఆరు రోజుల వ్యవధిలో రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఫలితాలు ఒకే విధంగా రావడం ఆసక్తి కలిగించింది. అయితే రెండు టెస్టు మ్యాచ్‌లు.. రెండు రోజుల్లోనే ముగియడం 1889 తర్వాత ఇదే కావడం అరుదైన రికార్డుగా నిలిచింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బుధవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 72 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. సీన్‌ విలియమ్స్‌ (105; 10 ఫోర్లు) అద్భుత సెంచరీ సాధించగా... సికిందర్‌ రజా (43; 5 ఫోర్లు), రెగిస్‌ చకబ్వా (44; 6 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. 119 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అఫ్గానిస్తాన్‌ 45.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (76; 10 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో న్యాయచి (3/30), డొనాల్డ్‌ టిరిపానో (3/23), ముజరబాని (2/14) అఫ్గానిస్తాన్‌ను దెబ్బతీశారు. 17 పరుగుల విజయలక్ష్యాన్ని జింబాబ్వే వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. 
చదవండి: జింబాబ్వే అద్భుతం.. రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌

>
మరిన్ని వార్తలు