గుండెపోటును దాటి గోల్ఫ్‌కు...

13 Nov, 2020 04:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే గుండెపోటుకు గురైన భారత విఖ్యాత కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ మళ్లీ మైదానంలోకి దిగారు. తన ఫిట్‌నెస్‌ స్థాయి ఏంటో చాటారు. 61 ఏళ్ల కపిల్‌కు ఇటీవలే యాంజియోప్లాస్టీ చేశారు. కాస్త విశ్రాంతి తీసుకున్న ఆయన వైద్యుల అనుమతితో గురువారం ఢిల్లీ గోల్ఫ్‌ క్లబ్‌లో గోల్ఫ్‌ ఆడారు. భారత్‌కు తొలి ప్రపంచకప్‌ (1983) అందించిన ఆయన తదనంతరం తనకెంతో ఇష్టమైన గోల్ఫ్‌ వైపు మళ్లారు. మళ్లీ మైదానంలోకి దిగడంపై కపిల్‌ ట్వీట్‌ చేశారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వివరించలేను. గోల్ఫ్‌ కోర్స్, క్రికెట్‌ గ్రౌండ్‌... ఏదైనా సరే మళ్లీ ఆడటమనేది చాలా ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా ఉంది. నా మిత్రులతో కలిసి ఇలా సరదాగా ఆడటం నిజంగా తృప్తినిచ్చింది. జీవితమంటే ఇదేనేమో!’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక 1994 నుంచి కపిల్‌ దేవ్‌ రెగ్యులర్‌గా గోల్ఫ్‌ ఆడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ పోటీపడ్డారు.   
 

మరిన్ని వార్తలు