ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి

3 Apr, 2024 04:30 IST|Sakshi

నేటి నుంచి క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ

టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్‌ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్‌ (తమిళనాడు), విదిత్‌ (మహారాష్ట్ర)... మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్‌), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

భారత్‌ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఓపెన్‌ విభాగంలో 8 మంది... మహిళల విభాగంలో 8 మంది మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మొత్తం 14 రౌండ్ల చొప్పున టోర్నీని నిర్వహిస్తారు. అత్యధిక పాయింట్లు గెలిచిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు.

క్యాండిడేట్స్‌ టోర్నీ ఓపెన్‌ విభాగం విజేత ప్రస్తుత విశ్వవిజేత డింగ్‌ లిరెన్‌ (చైనా)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో ప్రపంచ టైటిల్‌ కోసం తలపడతారు. బుధవారం కేవలం ప్రారంభోత్సవం ఉంది. గురువారం తొలి రౌండ్‌ గేమ్‌లు జరుగుతాయి. ఈ టోర్నీలో పోటీపడనున్న క్రీడాకారుల వివరాలు...  

ఓపెన్‌ విభాగం: ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్‌ (భారత్‌) , నెపోమ్‌నిషి (రష్యా), కరువానా, నకముర (అమెరికా), అబసోవ్‌ (అజర్‌బైజాన్‌), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌). మహిళల విభాగం: హంపి, వైశాలి (భారత్‌), టింగ్‌జీ లె, టాన్‌ జోంగి (చైనా), కాటరీనా లాగ్నో, గొర్యాక్‌చినా (రష్యా), సలీమోవా (బల్గేరియా), అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌).
 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers