విమర్శలను పట్టించుకోకుండా ఆటపై దృష్టి సారించా: రిషబ్‌

25 Jan, 2021 17:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ధోనీ వారసుడిగా అప్పటి వరకు సాఫీగా సాగిన అతని ప్రయాణం.. అధిక అంచనాలు, బ్యాటింగ్‌లో నిలకడలేమీ, వికెట్ల వెనుక వైఫల్యం, ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఏకంగా జట్టులో స్థానం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడి, కుదుపునకు లోనైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో(14 మ్యాచ్‌ల్లో 343 పరుగులు) బ్యాట్‌తో పర్వాలేదనిపించినా, వికెట్‌ కీపింగ్‌లో వైఫల్యాలు, అధిక బరువు కారణంగా.. సోషల్‌ మీడియాలో అతని అభిమానులకే టార్గెట్‌గా మారిపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆసీస్‌ పర్యటనలో టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన అతను.. ప్రపంచవ్యాప్త క్రికెట్‌ అభిమానులకు ఆరాధ్యుడయ్యాడు. సోషల్‌ మీడియాలో తనను అవమానించిన వాళ్లకు ఇప్పుడతను డార్లింగ్‌ క్రికెటర్‌గా మారిపోయాడు. అతడే రిషబ్‌ పం‍త్‌.

ఆసీస్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న రిషబ్‌ పంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. విమర్శలను పట్టించుకోకుండా ఆటపై దృష్టి సారించినందుకే తాను పూర్వవైభవాన్ని సాధించగలిగానని పేర్కొన్నాడు‌. ఆసీస్‌ పర్యటనకు ముందు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, అయినప్పటికీ తాను ఏమాత్రం కుంగిపోలేదని, తన బలాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగానని వివరించాడు. ఆటలో వైఫల్యాలు ఎదురైనప్పుడు విమర్శలు మామూలేనని, వాటిని ఆటతీరుతోనే తిప్పికొట్టాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన పేర్కొన్నాడు. విమర్శలను పట్టించుకోకుండా ఉండేందుకు తాను సోషల్‌ మీడియాకు కూడా దూరంగా ఉన్నట్లు వెల్లడించాడు.

ఆసీస్‌ పర్యటనలో అత్యధిక పరుగులు(3 టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు) సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచిన ఈ ఉత్తరాఖండ్‌ కుర్రాడు.. తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. సిడ్నీ టెస్టులో అతను సాధించిన 97 పరుగులు, బ్రిస్బేన్‌ టెస్టులో అతని మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌(89 నాటౌట్‌) టీమిండియా అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో అతను అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారత వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ధోనీ పేరిట నమోదైవుంది. ఆసీస్‌ పర్యటనకు కేవలం టెస్టు జట్టు సభ్యుడిగా ఎంపికైన పంత్‌.. నిలకడలేమి, అధిక బరువు సమస్యల కారణంగా తుది జట్టులో ఆడతాడా లేదా అన్న అనుమానం ప్రతి భారతీయుడిలో ఉండింది. అయితే అనూహ్యంగా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న పంత్‌ తన ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలనందుకున్నాడు. 

>
మరిన్ని వార్తలు